Ebrahim Rezaei: పాకిస్తాన్ మధ్యవర్తిత్వానికి పనికి రాదు: ఇరాన్ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
ఈ వార్తాకథనం ఏంటి
ప్రాంతీయంగా కొనసాగుతున్న కీలక చర్చల్లో పాకిస్థాన్ మధ్యవర్తి పాత్రపై ఇరాన్ అనుమానాలు వ్యక్తం చేసింది. పాకిస్థాన్ నిష్పాక్షికంగా వ్యవహరించడం లేదని,అమెరికాకు అనుకూలంగా మొగ్గు చూపుతోందని ఇరాన్ ఎంపీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ పరిణామం దౌత్య వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.ఇరాన్ జాతీయ భద్రత,విదేశాంగ విధాన కమిషన్ అధికార ప్రతినిధి,ఎంపీ ఇబ్రహీం రెజాయీ ఈ వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ తమకు స్నేహపూర్వక పొరుగు దేశమే అయినప్పటికీ, మధ్యవర్తిత్వానికి తగిన దేశం కాదని ఆయన పేర్కొన్నారు. మధ్యవర్తి అనేవారు పూర్తిగా నిష్పక్షపాతంగా ఉండాలని,అయితే పాకిస్థాన్ తరచుగా ఒకవైపు మొగ్గు చూపుతోందని ఆయన విమర్శించారు. అమెరికాను విమర్శించడంలో ఇస్లామాబాద్ వెనుకంజ వేస్తోందని కూడా ఆరోపించారు.
వివరాలు
మధ్యవర్తి నిష్పక్షపాతంగా ఉండాలని.. ఒకవైపు మొగ్గకూడదని హితవు
లెబనాన్ పరిస్థితులు, నిలిపివేసిన ఆస్తుల విషయంలో అమెరికా ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదని ప్రస్తావించడంలో పాకిస్థాన్ విఫలమైందని ఆయన తెలిపారు. ఈ వ్యాఖ్యల మధ్యనే ఇరాన్ దౌత్యవేత్త అబ్బాస్ అరాఘ్చి చర్చలను ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నారు. గత మూడు రోజుల్లో ఆయన రెండుసార్లు ఇస్లామాబాద్ పర్యటించి,పాకిస్థాన్ సైన్యాధిపతి అసిమ్ మునీర్ తో సమావేశమయ్యారు. అంతకుముందు ఇరాన్ విదేశాంగ మంత్రి కూడా పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ ను కలుసుకున్నారు. ఇప్పటి చర్చలు కేవలం అణు ఒప్పందానికి మాత్రమే పరిమితం కావడం లేదని ఇరాన్ వర్గాలు చెబుతున్నాయి. హర్మూజ్ జలసంధికి కొత్త చట్టపరమైన రూపకల్పన,నష్టపరిహారం డిమాండ్లు, సైనిక చర్యలకు వ్యతిరేక హామీలు,సముద్ర ఆంక్షల ఎత్తివేత వంటి అంశాలు కూడా చర్చల్లో ఉన్నట్లు సమాచారం.
వివరాలు
ఇరాన్‌తో చర్చలకు సిద్ధమేనని, వారే తమను సంప్రదించాలన్న ట్రంప్
ఇస్లామాబాద్ పర్యటన అనంతరం అరాఘ్చి మాస్కోకు వెళ్లనున్నారని తెలుస్తోంది. మరోవైపు, ఇరాన్‌తో చర్చలు నెమ్మదించడం పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. చర్చలు కొనసాగించాలని ఉంటే ఇరానే నేరుగా సంప్రదించవచ్చని ఆయన అన్నారు. తమతో మాట్లాడాలనుకుంటే నేరుగా రావచ్చని లేదా ఫోన్ ద్వారా సంప్రదించవచ్చని పేర్కొన్నారు. సురక్షితమైన సమాచార వ్యవస్థలు తమ వద్ద ఉన్నాయని చెప్పారు. పాకిస్థాన్‌లో జరగాల్సిన చర్చల రౌండ్‌ను వాషింగ్టన్ రద్దు చేసిన తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.