LOADING...
Pakistan: ఇరాన్-అమెరికా ఉద్రిక్తతల మధ్య పాక్ మధ్యవర్తిత్వం.. ట్రంప్ గ్రీన్ సిగ్నల్
ఇరాన్-అమెరికా ఉద్రిక్తతల మధ్య పాక్ మధ్యవర్తిత్వం.. ట్రంప్ గ్రీన్ సిగ్నల్

Pakistan: ఇరాన్-అమెరికా ఉద్రిక్తతల మధ్య పాక్ మధ్యవర్తిత్వం.. ట్రంప్ గ్రీన్ సిగ్నల్

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 25, 2026
08:31 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇరాన్-అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను తగ్గించే ప్రయత్నంలో పాకిస్థాన్ కీలక పాత్ర పోషించేందుకు ముందుకొచ్చింది. ఈ మేరకు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ చేసిన ప్రతిపాదనకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సానుకూలంగా స్పందించడం ప్రాధాన్యం సంతరించుకుంది. మంగళవారం సాయంత్రం 'ఎక్స్'(ట్విట్టర్)వేదికగా షెహబాజ్ షరీఫ్ స్పందిస్తూ.."అమెరికా,ఇరాన్ అంగీకరిస్తే,యుద్ధానికి ముగింపు పలికే అర్థవంతమైన చర్చలకు పాకిస్థాన్ వేదికగా నిలవడానికి సిద్ధంగా ఉంది" అని తెలిపారు. ఈ ట్వీట్ వెలువడిన కొద్ది సేపటికే ట్రంప్ దానిని స్క్రీన్‌షాట్ తీసి తన 'ట్రూత్ సోషల్' ఖాతాలో షేర్ చేయడం విశేషంగా మారింది. ఇంతకుముందు"మేమే యుద్ధంలో విజయం సాధించాం"అని ప్రకటించిన ట్రంప్, ఇప్పుడు చర్చల వైపు మొగ్గు చూపడం అంతర్జాతీయ రాజకీయాల్లో కీలక మలుపుగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

వివరాలు 

రంగంలోకి ట్రంప్ కోర్ టీమ్

ఈ చర్చలను ముందుకు తీసుకెళ్లేందుకు ట్రంప్ తన నమ్మకమైన బృందాన్ని రంగంలోకి దించనున్నట్లు సమాచారం. ప్రత్యేక ప్రతినిధులు: ట్రంప్ సన్నిహితుడు స్టీవ్ విట్‌కాఫ్, అల్లుడు జారెడ్ కుష్నర్ ఈ వారంలోనే ఇస్లామాబాద్ చేరుకుని ఇరాన్ ప్రతినిధులతో చర్చలు జరిపే అవకాశం ఉంది. జేడీ వాన్స్ రాక: అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కూడా ఈ కీలక చర్చల్లో పాల్గొనడానికి పాకిస్థాన్ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఇరాన్ వైఖరి మార్పు: మొదట చర్చల వార్తలను ఖండించిన ఇరాన్, ఇప్పుడు మిత్రదేశాల ద్వారా అమెరికా నుంచి ప్రతిపాదనలు వచ్చినట్లు అంగీకరించింది. ఇరాన్ తరఫున పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాఘేర్ గాలిబాఫ్ ఈ చర్చలకు హాజరయ్యే అవకాశం ఉందని సమాచారం.

వివరాలు 

తెరవెనుక పాక్ ఆర్మీ చీఫ్ పాత్ర?

ఈ శాంతి చర్చల ప్రతిపాదన వెనుక పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ కీలకంగా వ్యవహరించినట్లు దౌత్య వర్గాలు చెబుతున్నాయి. యుద్ధ ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలోనే, సుమారు రెండు వారాల క్రితం మునీర్.. అమెరికా ప్రతినిధులు విట్‌కాఫ్, కుష్నర్‌లతో రహస్యంగా భేటీ అయినట్లు సమాచారం. అంతేకాకుండా, డొనాల్డ్ ట్రంప్‌కు నోబెల్ శాంతి బహుమతి దక్కేలా చేయాలనే ఉద్దేశంతో పాకిస్థాన్ ఈ స్థాయిలో ప్రయత్నాలు చేస్తోందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.

Advertisement

వివరాలు 

మోదీతో ట్రంప్ చర్చలు

ఇక అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత ప్రధాని మోదీతో ఫోన్‌లో మాట్లాడారు. పశ్చిమాసియాలో శాంతి పునరుద్ధరణకు భారత్ మద్దతు ఇస్తుందని మోదీ స్పష్టం చేశారు. అలాగే హార్ముజ్ జలసంధి ద్వారా వాణిజ్యం అంతరాయం లేకుండా సాగడం ప్రపంచానికి అత్యంత కీలకమని పేర్కొన్నారు. అయితే,పాకిస్థాన్ మధ్యవర్తిత్వంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు.మోదీ విదేశాంగ విధానం విఫలమైందని ఆయన ఆరోపించారు. ఒకవైపు శాంతిచర్చలపై చర్చలు జరుగుతుండగా,మరోవైపు క్షేత్రస్థాయిలో ఉద్రిక్తతలు తగ్గడం లేదు. మంగళవారం కూడా ఇరాన్,ఇజ్రాయెల్ దేశాలు పరస్పరం క్షిపణి దాడులు జరిపాయి. "ఇది కంటికి కన్ను తీసే స్థాయి కాదు..తలకు తల తీసే సమయం"అని ఇరాన్ హెచ్చరించగా,తమ దాడులు పూర్తి తీవ్రతతో కొనసాగుతాయని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది.

Advertisement