LOADING...
Khawaja Asif: ఐఎస్‌ఐ గుప్పిట్లో పాక్‌ పార్లమెంట్‌.. రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ సంచలన వ్యాఖ్యలు
రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ సంచలన వ్యాఖ్యలు

Khawaja Asif: ఐఎస్‌ఐ గుప్పిట్లో పాక్‌ పార్లమెంట్‌.. రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ సంచలన వ్యాఖ్యలు

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 18, 2026
01:19 pm

ఈ వార్తాకథనం ఏంటి

పాకిస్థాన్‌లో పౌర ప్రభుత్వాల కంటే సైన్యం, నిఘా సంస్థల ప్రభావమే ఎక్కువగా ఉంటుందనే వాదనకు మరోసారి బలం చేకూరింది. పాక్‌ నిఘా సంస్థ ఐఎస్‌ఐ (ISI) దేశ చట్టసభ కార్యకలాపాలపై ప్రభావం చూపిందని ఆ దేశ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్‌ స్వయంగా జాతీయ అసెంబ్లీలో అంగీకరించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ పరిస్థితికి మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ పాలనే కారణమని ఆయన ఆరోపించారు. జాతీయ అసెంబ్లీలో ప్రసంగించిన ఖవాజా ఆసిఫ్‌ మాట్లాడుతూ.. ఇమ్రాన్‌ ఖాన్‌ అధికారంలో ఉన్న సమయంలో ఐఎస్‌ఐకి అపార స్వేచ్ఛ కల్పించారని పేర్కొన్నారు. అప్పటి ఐఎస్‌ఐ డైరెక్టర్‌ జనరల్‌ జనరల్‌ ఫైజ్‌ హమీద్‌ తరచూ కీలక అధికారిక సమావేశాల్లో పాల్గొనేవారని వెల్లడించారు.

వివరాలు 

ఐఎస్‌ఐ ఒత్తిడి కారణంగానే కొన్ని కీలక చట్ట సవరణలు

అంతేకాకుండా, అప్పటి స్పీకర్‌ నివాసంలో జరిగిన ముఖ్య సమావేశాలకు కూడా ఫైజ్‌ హమీద్‌ హాజరై, చట్టసభ కార్యకలాపాలు,కీలక నిర్ణయాలపై ప్రభావం చూపారని ఖవాజా ఆసిఫ్‌ ఆరోపించారు. ఐఎస్‌ఐ ఒత్తిడి కారణంగానే కొన్ని కీలక చట్ట సవరణలు చేయాల్సి వచ్చిందని ఆయన చెప్పారు. ముఖ్యంగా యాంటీ మనీలాండరింగ్‌ చట్టంలో చేసిన సవరణలు కూడా నిఘా సంస్థ ప్రభావంతోనే జరిగాయని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా, ఐఎస్‌ఐకి అనుకూలంగా ఉండే కొన్ని చట్టాలను కూడా అప్పట్లో అమల్లోకి తీసుకొచ్చారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే, ప్రస్తుత ప్రభుత్వ వైఖరి భిన్నంగా ఉందని ఖవాజా ఆసిఫ్‌ స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం సైన్యంతో సమన్వయంగా పనిచేస్తోందని, దేశ ప్రయోజనాల దృష్ట్యా పౌర-సైనిక హైబ్రిడ్‌ పాలనా విధానాన్ని అనుసరిస్తున్నట్లు తెలిపారు.

వివరాలు 

దేశ రాజకీయాల్లో కొత్త చర్చకు రక్షణ మంత్రి వ్యాఖ్యలు

ఈ విధానం వల్ల సానుకూల ఫలితాలు లభిస్తున్నాయని ఆయన వెల్లడించారు. పాక్‌ రక్షణ మంత్రి చేసిన ఈ వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి. ముఖ్యంగా పాకిస్థాన్‌ రాజకీయ వ్యవస్థలో సైన్యం, ఐఎస్‌ఐ పాత్రపై మరోసారి తీవ్ర చర్చ మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Advertisement