Pakistan President Zardari: భారత్ యుద్ధ సన్నాహాలు చేస్తోందా? జర్దారీ సంచలన ఆరోపణలు
ఈ వార్తాకథనం ఏంటి
భారత్ మరో యుద్ధానికి సిద్ధమవుతోందని పాకిస్థాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ తీవ్ర ఆరోపణలు చేశారు. సరిహద్దు ప్రాంతాల్లో భారత సైన్యం కదలికలు గణనీయంగా పెరిగాయని, ఈ పరిస్థితులు ప్రాంతీయ శాంతి భద్రతలకు ప్రమాదకరమని ఆయన అభిప్రాయపడ్డారు. సోమవారం పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త సమావేశంలో మాట్లాడిన జర్దారీ, భారత్ వైఖరిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సింధు నదీ జలాల ఒప్పందం నుంచి భారత్ ఏకపక్షంగా తప్పుకోవడాన్ని ఆయన తీవ్రంగా విమర్శించారు. ఈ నిర్ణయాన్ని 'జల ఉగ్రవాదం' (హైడ్రో టెర్రరిజం)గా అభివర్ణిస్తూ, "నీటిని ఆయుధంలా ఉపయోగించి పాకిస్థాన్ వ్యవసాయ వ్యవస్థను దెబ్బతీయాలన్నది భారత్ ఉద్దేశం. ఇది అంతర్జాతీయ నిబంధనలకు విరుద్ధం"అని ఆరోపించారు.
వివరాలు
ఆఫ్ఘనిస్థాన్‌లోని తాలిబన్ ప్రభుత్వానికి కూడా హెచ్చరికలు జారీ
కశ్మీర్ సమస్యకు స్థిరమైన పరిష్కారం రాకపోతే దక్షిణాసియాలో శాంతి స్థాపన అసాధ్యమని ఆయన స్పష్టం చేశారు. యుద్ధ వాతావరణాన్ని విడిచిపెట్టి చర్చల మార్గాన్ని ఎంచుకోవాలని భారత్‌ను కోరారు. ఇక అఫ్ఘనిస్థాన్‌లో అధికారంలో ఉన్న తాలిబన్ ప్రభుత్వానికీ జర్దారీ హెచ్చరికలు జారీ చేశారు. పాకిస్థాన్‌పై దాడులు చేస్తున్న ఉగ్రవాద గుంపులను అణచివేయాలని, లేకపోతే కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని స్పష్టం చేశారు.
వివరాలు
పాకిస్థాన్ ఆరోపణలను తిరస్కరించిన భారత్
సరిహద్దు ప్రాంతాల్లో 'ఘజబ్ లిల్ హక్' పేరుతో సైనిక ఆపరేషన్ కొనసాగుతోందని గుర్తుచేశారు. మరోవైపు, పాకిస్థాన్ ఆరోపణలను భారత్ ఆరంభం నుంచే తిరస్కరిస్తోంది. సరిహద్దు దాటి జరిగే ఉగ్రచర్యలు పూర్తిగా ఆగే వరకు చర్చలు జరగవని న్యూఢిల్లీ స్పష్టంచేసింది. గత సంవత్సరం పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి అనంతరం భారత్ తన విధానాన్ని మరింత కఠినంగా మార్చింది. ఉగ్రవాదాన్ని అరికట్టే వ్యూహంలో భాగంగానే సింధు జలాల ఒప్పందంపై ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.