LOADING...
Pak-Afghan: మళ్లీ భగ్గుమన్న పాక్‌- అఫ్గాన్‌ వాయువ్య సరిహద్దు..!
మళ్లీ భగ్గుమన్న పాక్‌- అఫ్గాన్‌ వాయువ్య సరిహద్దు..!

Pak-Afghan: మళ్లీ భగ్గుమన్న పాక్‌- అఫ్గాన్‌ వాయువ్య సరిహద్దు..!

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 15, 2025
09:10 am

ఈ వార్తాకథనం ఏంటి

పాకిస్థాన్‌,అఫ్గానిస్థాన్‌ సరిహద్దు ప్రాంతాల్లో మరోసారి ఉద్రిక్తతలు చెలరేగాయి. ఎలాంటి కవ్వింపు చర్యలు లేకుండానే అఫ్గాన్‌ సైన్యం కాల్పులు జరిపిందని పాకిస్థాన్‌ అధికారులు ఆరోపించారు. అఫ్గాన్‌ దళాల దాడులకు ప్రతిస్పందనగా తామూ ఎదురుదాడులు జరిపామని,అందులో అఫ్గాన్‌ ట్యాంకులు,సైనిక స్థావరాలు ధ్వంసమైనట్లు పాక్‌ భద్రతా వర్గాలు వెల్లడించాయి. ఈ సంఘటనను అఫ్గాన్‌లోని ఖోస్ట్‌ ప్రావిన్స్‌ డిప్యూటీ పోలీసు ప్రతినిధి తాహిర్‌ అహ్రర్‌ కూడా ధ్రువీకరించారు. పాక్‌ ప్రభుత్వ మీడియా నివేదికల ప్రకారం, అఫ్గాన్‌ సైన్యం, తెహ్రీక్‌-ఇ-తాలిబాన్‌ పాకిస్థాన్‌ (TTP) సంయుక్తంగా పాక్‌ భూభాగంలోని సైనిక పోస్ట్‌లపై కాల్పులు జరిపాయి. ఈ దాడులకు తమ దళాలు బలమైన ప్రతిదాడులు చేపట్టాయని, టీటీపీకి చెందిన పెద్ద శిక్షణ కేంద్రాన్ని పూర్తిగా ధ్వంసం చేశామని పాక్‌ అధికారులు వివరించారు.

వివరాలు 

మధ్యవర్తిత్వానికి ముందుకు వచ్చిన జేయూఐ-ఎఫ్‌ చీఫ్‌ 

పాక్‌-అఫ్గాన్‌ సరిహద్దులో జరుగుతున్న ఘర్షణలపై జమీత్‌ ఉలేమా-ఇ-ఇస్లాం-ఫజ్ల్‌ (JUI-F) పార్టీ అధినేత మౌలానా ఫజ్లుర్‌ రెహమాన్‌ స్పందించారు. ఇరుదేశాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలను తగ్గించేందుకు మధ్యవర్తిత్వం చేయడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. గతంలో కూడా పాక్‌-అఫ్గాన్‌ మధ్య వివాదాల సమయంలో తాను కీలక పాత్ర పోషించానని, ప్రస్తుత పరిస్థితుల్లో కూడా అదే విధంగా చొరవ చూపేందుకు సిద్ధంగా ఉన్నానని ఆయన అన్నారు. ప్రస్తుతం అఫ్గాన్‌ అధికారులతో సంప్రదింపులు కొనసాగిస్తున్నట్లు పేర్కొంటూ, ఇరుదేశాలు పరస్పరం శాంతి, సహనం పాటించాలని ఫజ్లుర్‌ రెహమాన్‌ విజ్ఞప్తి చేశారు.