Pakistan: తోషాఖానా కేసులో పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, భార్యకు 14 ఏళ్ల జైలు శిక్ష
తోషాఖానా కేసులో పాకిస్థాన్ మాజీ ప్రధాని,పాకిస్థాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ (పీటీఐ)వ్యవస్థాపకుడు ఇమ్రాన్ ఖాన్,ఆయన భార్య బుష్రా బీబీకి పాకిస్థాన్ కోర్టు 14 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అంతేకాకుండా,ఈ జంట 10 సంవత్సరాల పాటు ప్రభుత్వ కార్యాలయాన్ని నిర్వహించకుండా నిషేధించారు. వారికి రూ.787 మిలియన్ పాకిస్తానీ రూపాయిలు జరిమానా విధించారు. ప్రభుత్వ రహస్యాలను ఉల్లంఘించినందుకు పాకిస్తాన్ ప్రత్యేక కోర్టు ఖాన్ , మాజీ పాకిస్తాన్ విదేశాంగ మంత్రి షా మెహమూద్‌లను 10 సంవత్సరాల పాటు జైలులో ఉంచిన ఒక రోజు తర్వాత ఇది జరిగింది.
అసలు ఈ తోషాఖానా కేసు ఏంటి?
ఇమ్రాన్ ప్రధానిగా ఉన్న సమయంలో వచ్చిన బహుమతుల విక్రయానికి సంబంధించిన కల్పిత వివరాలను ఎన్నికల సంఘానికి సమర్పించారని ఆరోపిస్తూ 2022లో అధికార పార్టీ శాసనసభ్యులు పాకిస్థాన్ ఎన్నికల కమిషన్ లో తోషాఖానా కేసును దాఖలు చేసినట్లు వార్తాసంస్థ PTI నివేదించింది. ECP మొదట ఖాన్ ను అనర్హుడిగా ప్రకటించి,సెషన్స్ కోర్టులో క్రిమినల్ ప్రొసీడింగ్స్ కేసును దాఖలు చేసింది. ఆతరువాత ఖాన్ ను దోషిగా నిర్ధారించి జైలుకు పంపించింది. ఖాన్ 2018 నుండి 2022 వరకు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో,విదేశాల నుంచి బహుమతులు అందుకొని..పదవి నుంచి వైదొలగిన తర్వాత వాటిని తోషఖానాలో జమ చేయకుండా చాలా తక్కువ ధర చెల్లించి వాటిని తన వద్దే ఉంచుకున్నారని,మరికొన్నింటిని తోషఖానాకు తెలియకుండా విదేశాల్లోనే అమ్మేశారని ఆరోపణలు వచ్చాయి.
ఇప్పటివరకు ఇమ్రాన్ ఖాన్ పై 150 కేసులు
ఖాన్ తన మూడున్నర సంవత్సరాల కాలంలో ప్రపంచ నాయకుల నుండి రూ.140 మిలియన్ల కంటే ఎక్కువ విలువైన 58 బహుమతులను అందుకున్నాడు. వాటన్నింటిని అతితక్కువ మొత్తాన్ని చెల్లించి లేదా ఎటువంటి చెల్లింపు లేకుండా తన వద్దే ఉంచుకున్నాడు. వచ్చే నెల 8న పాకిస్థాన్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ తరుణంలో ఇప్పటివరకు ఆయనపై 150 కేసులు నమోదైనట్లు తెలుస్తోంది.