Shehbaz Sharif: పాకిస్థాన్ ప్రధానిగా షెహబాజ్ ఎన్నిక.. రెండోసారి వరించిన పదవి
పాకిస్థాన్ 24వ ప్రధానమంత్రిగా షెహబాజ్ షరీఫ్ ఎన్నికయ్యారు. ప్రధానమంత్రిని ఎన్నుకునేందుకు జాతీయ అసెంబ్లీలో ఆదివారం ఓటింగ్ జరిగింది. 201 ఓట్లు సాధించి షెహబాజ్ షరీఫ్ రెండోసారి ప్రధానిగా ఎన్నికైనట్లు నేషనల్ అసెంబ్లీ స్పీకర్ అయాజ్ సాదిక్ వెల్లడించారు. షహబాజ్ షరీఫ్ 2022లో తొలిసారిగా పాకిస్థాన్ ప్రధాని అయ్యారు. ఆ తర్వాత 16 నెలల పాటు ప్రధానిగా కొనసాగారు. ఇటీవల జరిగిన జాతీయ అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఏర్పడిన సంకీర్ణ ప్రభుత్వంలో రెండోసారి ఆయన ప్రధానమంత్రి అయ్యారు. మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ తమ్ముడే షాబాజ్ షరీఫ్. ఈయన 1950లో లాహోర్‌లో జన్మించారు. షెహబాజ్ 1985లో లాహోర్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ అధ్యక్షుడిగా కూడా ఎన్నికయ్యారు.
మూడుసార్లు పంజాబ్ ముఖ్యమంత్రిగా
షెహబాజ్ 1988లో తొలిసారిగా పంజాబ్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 1997లో మూడోసారి పంజాబ్ అసెంబ్లీ సభ్యునిగా ఎన్నికై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు. 1999లో సైనిక తిరుగుబాటులో పదవీచ్యుతుడయ్యారు. అతను 8 సంవత్సరాల పాటు విదేశాల్లో గడిపిన తర్వాత 2007లో పాకిస్థాన్‌కు వచ్చారు. 2008లో నాలుగోసారి భక్కర్ ప్రావిన్షియల్ అసెంబ్లీ సీటులో పోటీ చేసి గెలిచారు. ఈ సందర్భంగా రెండోసారి పంజాబ్ ముఖ్యమంత్రి అయ్యారు. 2013లో మరోసారి లాహోర్ నుంచి శాసన సభ సభ్యుడిగా ఎన్నికై.. మూడోసారి పంజాబ్ ముఖ్యమంత్రిగా అయ్యారు. 2018లో తన అన్నయ్య నవాజ్ షరీఫ్‌పై సుప్రీంకోర్టు అనర్హత వేటు వేయడంతో అతను పాకిస్థాన్ ముస్లిం లీగ్ (ఎన్) పార్టీకి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.