Pak-Afghan: తాలిబన్లతో చర్చలు విఫలం.. ప్రకటించిన పాకిస్థాన్
ఈ వార్తాకథనం ఏంటి
తుర్కియే వేదికగా ఆఫ్ఘనిస్తాన్ - పాకిస్థాన్ మధ్య జరిగిన శాంతి చర్చలు ఫలితం లేకుండా ముగిశాయి. సరిహద్దుల్లో కాల్పుల విరమణ, సరిహద్దు ఉగ్రవాద కార్యకలాపాలు వంటి ప్రధాన అంశాలపై రెండు దేశాలు శనివారం నుంచి చర్చలు ప్రారంభించాయి. అయితే, ఈ చర్చలు ఏకాభిప్రాయం లేకుండా ముగిసిపోయాయని పాకిస్థాన్ బుధవారం అధికారికంగా ప్రకటించింది. "ఎటువంటి పరిష్కారం సాధ్యపడలేదు" అని పాక్ సమాచార, ప్రసారశాఖ మంత్రి అతావుల్లా తరార్ తెలిపారు. అఫ్గాన్ భూభాగం నుంచి తమ దేశంపై దాడులు జరుపుతున్న ఉగ్రవాదులను అడ్డుకోవాలని కాబూల్‌ను కోరినా, ఆ విషయంలో ఎటువంటి హామీ ఇవ్వలేదని ఆయన పేర్కొన్నారు. అంతేకాక, దోహా ఒప్పందం కింద తాలిబన్లు ఇచ్చిన లిఖితపూర్వక హామీలను అమలు చేయడానికి కూడా వారు వెనుకడుగువేశారని తెలిపారు.
వివరాలు
భారత్‌పై పాక్ విమర్శలు
చర్చలు విఫలమవ్వడానికి భారత్ ప్రధాన కారణమని పాక్ రక్షణ మంత్రి ఆసిఫ్ ఖవాజా ఆరోపించారు. తాలిబన్లు ఇప్పుడు దిల్లీ ఆధీనంలోకి వెళ్లిపోయారని, భారత్ చేతిలో వారు కీలుబొమ్మలుగా మారారని ఆయన విమర్శించారు. కాబూల్‌తో ఒప్పందం దిశగా అడుగులు వేస్తే ప్రతిసారీ బయటి జోక్యాలు చర్చలను అడ్డుకుంటున్నాయని పరోక్షంగా భారత్‌పై ఆరోపణలు చేశారు. బలోచిస్థాన్‌లో వైమానిక దాడులు ఇదిలా ఉండగా, బలోచ్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్‌ఏ) ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకుని పాకిస్థాన్ మంగళవారం అర్ధరాత్రి భారీ వైమానిక దాడులు జరిపింది. ఈ దాడుల్లో సుమారు 14 మంది మృతి చెందినట్లు సమాచారం. బలోచిస్థాన్‌లోని చిల్తాన్ పర్వత ప్రాంతంలో బీఎల్‌ఏ ఉగ్రవాదులపై పాక్ బలగాలు ఖచ్చితమైన లక్ష్యాలతో వైమానిక దాడులు నిర్వహించినట్లు అక్కడి వర్గాలు తెలిపాయి.