Pakistan-Afghanistan: మూడో రోజుకి చేరుకున్న పాక్-అఫ్గాన్ ఘర్షణలు.. ఏకాభిప్రాయం కుదిరేనా..?
ఈ వార్తాకథనం ఏంటి
టర్కీలో జరుగుతున్న పాకిస్థాన్-తాలిబాన్ చర్చలు సోమవారం మూడో రోజుకి చేరుకున్నా, ఇరువైపులా ఏకాభిప్రాయం కుదరే సూచనలు కనబడటం లేదు. టర్కీ, ఖతార్ మధ్యవర్తిత్వం చేస్తున్న ఈ చర్చలు ప్రస్తుతం నిలకడ దశకు చేరుకుంటున్నాయన్న సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.
వివరాలు
తాలిబాన్‌కి తుది షరతులు తెలిపిన పాకిస్తాన్
పాకిస్తాన్ తన తుది ప్రతిపాదనను తాలిబాన్‌కు అందజేసి, తహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్ (టిటిపి)పై స్పష్టమైన, ధృవీకరించదగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిందని ఆ దేశ సీనియర్ అధికారి డాన్ పత్రికకు తెలిపారు. శనివారం, ఆదివారం ఇస్తాంబుల్‌లో జరిగిన రెండోదశ చర్చలలో ఇరువర్గాల మధ్య సంధి కుదరకపోవడంతో ఈ చర్చలు నిలిచిపోయినట్లు తెలుస్తోంది. దాదాపు తొమ్మిది గంటలపాటు సాగిన చర్చల్లో.. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్నారంటూ పాక్ చేస్తోన్న ఆరోపణలను అఫ్గాన్ ముందు నుంచి ఖండిస్తోంది. అలాగే తమ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించేలా పాక్ సైన్యం తీసుకుంటున్న చర్యలను తప్పుపట్టింది.
వివరాలు
సరిహద్దు ఘర్షణలు, మధ్యవర్తిత్వ ప్రయత్నాలు
ఇటీవల అక్టోబర్‌లో ఇరుదేశాల మధ్య జరిగిన ఘర్షణల్లో పౌరులు, సైనికులు, మిలిటెంట్లు సహా డజన్ల మంది మృతి చెందగా, వందల మందికి గాయాలయ్యాయి. పాకిస్తాన్ అఫ్ఘాన్ భూభాగంలో వైమానిక దాడులు జరపగా, తాలిబాన్ మాత్రం కాల్పుల విరమణను ఉల్లంఘించిందని పాకిస్తాన్‌పై ఆరోపించింది. ఈ వివాదంలో సౌదీ అరేబియా, ఖతార్ జోక్యం చేసుకోగా, ప్రస్తుతం టర్కీ-ఖతార్ మధ్యవర్తిత్వం కొనసాగుతోంది. అక్టోబర్ 15న ప్రారంభమైన కాల్పుల విరమణను 17, 19 తేదీల్లో పునరుద్ధరించారు. ఇప్పుడు జరుగుతున్న చర్చల ప్రధాన ఉద్దేశ్యం దీర్ఘకాలిక కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకోవడమే.
వివరాలు
భారత్‌పై పరోక్ష వ్యాఖ్యలు.. స్పందించిన తాలిబాన్
భారత్‌ను ఉద్దేశించి పాకిస్తాన్ అధికారి మాట్లాడుతూ, "తాలిబాన్ ఎవరో మరొకరి అజెండాను అనుసరిస్తున్నట్టు కనిపిస్తోంది. ఇది పాకిస్తాన్‌కి, ఆఫ్ఘానిస్తాన్‌కి, మొత్తం ప్రాంతానికి మంచిది కాదు" అని పేర్కొన్నారు. తాలిబాన్ మాత్రం పాకిస్తాన్ ఆరోపణలను "తార్కికం కానివి, వాస్తవ పరిస్థితులకు విరుద్ధమైనవి" అని కొట్టిపారేసింది. టోలో న్యూస్ ప్రకారం,తాలిబాన్ కాల్పుల విరమణకు రెండు షరతులు పెట్టింది. మొదటగా, పాకిస్తాన్ ఆఫ్ఘాన్ వైమానిక, భూసరిహద్దులను ఉల్లంఘించకూడదు. రెండవది, ఆఫ్ఘనిస్తాన్‌పై వ్యతిరేక కార్యకలాపాలకు తన భూభాగాన్ని ఉపయోగించేందుకు ఏ గుంపులకూ అనుమతి ఇవ్వకూడదు. అదే సమయంలో, తాలిబాన్ ప్రతిపాదించిన "టిటిపి ప్రతినిధులను కూడా చర్చల్లో భాగం చేయాలి" అన్న సూచనను పాకిస్తాన్ తిప్పికొట్టింది.
వివరాలు
టిటిపి నేపథ్యం
టిటిపి ఒక ఉగ్రవాద సంస్థగా గుర్తించబడినదని, దానితో చర్చలకు తాము సిద్ధంగా లేమని స్పష్టం చేసింది. తాలిబాన్ తమ భూభాగంలో ఆ సంస్థ కార్యకలాపాలను అరికట్టాలని కూడా పాకిస్తాన్ డిమాండ్ చేసింది. టిటిపి అంటే ఒక ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ . దీని లక్ష్యం పాకిస్తాన్ పాలనను తొలగించి కఠినమైన షరియా నిబంధనలను స్థాపించడం. టిటిపి, ఆఫ్ఘాన్ తాలిబాన్ వేర్వేరు సంస్థలైనా, వాటి సిద్ధాంతాలు, ఉద్దేశ్యాలు, ఆలోచనా దారులు దాదాపు ఒకేలా ఉన్నాయి. ఈ సంస్థ ఎక్కువగా ఆఫ్ఘాన్ భూభాగం నుంచే కార్యకలాపాలు నిర్వహిస్తోంది.