UN Security Council: ఐరాస భద్రతా మండలి నుండి పాకిస్తాన్ ఔట్.. ఐదు కొత్త దేశాల ఎంట్రీ
ఈ వార్తాకథనం ఏంటి
ఐక్యరాజ్య సమితి (ఐరాస) భద్రతా మండలిలో పాకిస్థాన్ సభ్యత్వం ఈ ఏడాది చివరితో ముగియనుంది. తాజాగా జరిగిన ఎన్నికల ఫలితాల ప్రకారం పాకిస్తాన్‌తో పాటు మరో నాలుగు దేశాలు తమ తాత్కాలిక సభ్యత్వాన్ని కోల్పోనున్నాయి. వాటి స్థానాల్లో ఐదు కొత్త దేశాలు 2027-28 కాలానికి భద్రతా మండలిలో చేరనున్నాయి. ఐరాస తాత్కాలిక సభ్య దేశాల ఎంపిక కోసం జూన్ 3న ఓటింగ్ నిర్వహించారు. ఈ ఎన్నికల్లో ఆస్ట్రియా, పోర్చుగల్, ట్రినిడాడ్ అండ్ టొబాగో, జింబాబ్వే దేశాలు సభ్యత్వాన్ని దక్కించుకోగా, కిర్గిస్తాన్ తొలిసారి భద్రతా మండలిలోకి ప్రవేశించే అవకాశం సాధించి చరిత్ర సృష్టించింది.
వివరాలు
కిర్గిస్తాన్-ఫిలిప్పైన్స్ మధ్య హోరాహోరీ పోటీ
ఐదు స్థానాల కోసం మొత్తం ఏడు దేశాలు పోటీ పడ్డాయి. అందులో నాలుగు స్థానాలు ఆస్ట్రియా, పోర్చుగల్, ట్రినిడాడ్ అండ్ టొబాగో, జింబాబ్వేలకు ఖరారయ్యాయి. అయితే చివరి ఒక్క స్థానానికి కిర్గిస్తాన్, ఫిలిప్పైన్స్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. విజేతను నిర్ణయించేందుకు అదనంగా మూడు రౌండ్ల ఓటింగ్ నిర్వహించాల్సి వచ్చింది. చివరికి కిర్గిస్తాన్ పైచేయి సాధించి తొలి సారి భద్రతా మండలి సభ్యత్వాన్ని పొందింది. ఈ ఏడాదితో ఐదు దేశాల సభ్యత్వం ముగింపు ప్రస్తుతం భద్రతా మండలిలో ఉన్న పాకిస్తాన్, పనామా, డెన్మార్క్, గ్రీస్, సోమాలియా దేశాల తాత్కాలిక సభ్యత్వం 2026 డిసెంబర్ 31తో ముగుస్తుంది.
వివరాలు
భద్రతా మండలి నిర్మాణం ఇలా..
అనంతరం వీటి స్థానాల్లో కొత్తగా ఎన్నికైన ఐదు దేశాలు 2027 జనవరి 1 నుంచి 2028 డిసెంబర్ 31 వరకు రెండేళ్లపాటు సభ్యులుగా కొనసాగనున్నాయి. ఐరాస భద్రతా మండలిలో మొత్తం 15 సభ్య దేశాలు ఉంటాయి. వీటిలో అమెరికా, రష్యా, చైనా, బ్రిటన్, ఫ్రాన్స్ దేశాలకు శాశ్వత సభ్యత్వం ఉంది. మిగిలిన 10 స్థానాలను తాత్కాలిక సభ్య దేశాలు రెండేళ్ల కాలానికి భర్తీ చేస్తాయి. సభ్యత్వం పొందాలంటే పోటీ చేసే దేశం కనీసం మూడింట రెండు వంతుల మెజారిటీ ఓట్లను సాధించాల్సి ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా శాంతి, భద్రత పరిరక్షణతో పాటు దేశాల మధ్య తలెత్తే వివాదాల పరిష్కారంలో ఐరాస భద్రతా మండలి కీలక పాత్ర పోషిస్తోంది.