
Shehbaz Sharif: 'ఆయన నిజంగా శాంతిని కోరుకునేవాడు'.. ట్రంప్‌ను పొగడ్తలతో ముంచెత్తిన పాక్ ప్రధాని
ఈ వార్తాకథనం ఏంటి
ఇజ్రాయెల్-హమాస్‌ల మధ్య నెలకొన్న యుద్ధానికి ముగింపు పలుకుతూ, ఈజిప్టులోని షర్మ్-ఎల్-షేక్‌లో శాంతి ఒప్పందంపై వివిధ దేశాధినేతలు సంతకాలు చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంలో పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ (Shehbaz Sharif) అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ప్రశంసలతో ముంచెత్తారు. ఆయనంత గొప్ప నాయకుడు లేడన్నట్లుగా పొగడ్తలు కురిపించారు. షరీఫ్ మాటలు విన్న ట్రంప్ ఆశ్చర్యపోయి, నవ్వులు ఆపుకోలేకపోయారు. చివరికి "ఇప్పుడే నేను ఇంకేమీ మాట్లాడలేను... ఇంటికి వెళ్లిపోదాం" అంటూ చమత్కారంగా స్పందించారు.
వివరాలు
భారత్- పాక్ మధ్య జరిగిన ఘర్షణను కూడా ట్రంపే ఆపారంటూ క్రెడిట్
షెహబాజ్ మాట్లాడుతూ.. "ఈ రోజు చరిత్రలో ఒక గొప్ప రోజు. ఎందుకంటే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలో గాజాలో శాంతి నెలకొంది. ఆయన నిజమైన శాంతి ప్రియుడు. ప్రపంచాన్ని శాంతి, సౌభాగ్యాలతో నింపేందుకు ఆయన చేసిన కృషి అసమానమైనది" అని తెలిపారు. అంతేకాకుండా, భారత్-పాకిస్తాన్‌ల మధ్య జరిగిన ఘర్షణను ఆపిన కీర్తి కూడా ట్రంప్‌కే చెందుతుందని షరీఫ్ స్పష్టం చేశారు. "భారత్, పాకిస్తాన్ రెండు అణ్వస్త్ర శక్తులు. ఆ నాలుగు రోజుల ఘర్షణలో ట్రంప్,ఆయన బృందం జోక్యం చేసుకోకపోతే, ఆ యుద్ధం పశ్చిమాసియాకు విస్తరించేది. అప్పుడు పరిస్థితులు అదుపు తప్పేవి, ఏం జరిగిందో చెప్పేందుకు ఎవరూ మిగిలి ఉండరేమో" అని ఆయన అన్నారు.
వివరాలు
షరీఫ్ ప్రసంగం నేపథ్యంలో.. ఆశ్చర్యంలో ఇటలీ ప్రధాని
ఇంతటి కృషి చేసిన ట్రంప్‌ను నోబెల్ శాంతి బహుమతికి (Nobel Peace Prize) పాకిస్తాన్ ప్రభుత్వం నామినేట్ చేసిందని షరీఫ్ ప్రకటించారు. "ఇప్పటివరకు ఆయన ఏడుసార్లు యుద్ధాలను ఆపారు. ఇది ఎనిమిదోది. అందుకే ఈ బహుమతికి ఆయన పూర్తిగా అర్హుడు" అని షరీఫ్ పేర్కొన్నారు. షరీఫ్ ప్రసంగం నేపథ్యంలో ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆశ్చర్యంగా నోటిమీద చేయి వేసుకొని చూస్తూ ఉండిపోయారు. ప్రసంగం ముగిసిన తర్వాత వేదికపై ఆసక్తికర దృశ్యాలు చోటుచేసుకున్నాయి. షరీఫ్ ప్రశంసల వర్షంలో తడిసిన ట్రంప్ - "ఇంతటి ప్రశంసలు వింటానని ఊహించలేదు. ఇప్పుడు మాట్లాడాల్సింది ఏమీ లేదు... ఇంటికి వెళ్దాం" అంటూ సరదాగా అన్నారు. దీంతో సభా ప్రాంగణం మొత్తం నవ్వులతో మార్మోగిపోయింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
షరీఫ్ ప్రసంగం
‘Let’s go home, there’s nothing more I have to say’
— RT (@RT_com) October 13, 2025
Trump is all praised out after Sharif’s speech
How rare is that? https://t.co/Zo8ahsSvmC pic.twitter.com/CviMIbkSlX