శాన్‌ఫ్రాన్సిస్కో: 'ఖలిస్థానీ' అనుకూల శక్తులకు వ్యతిరేకంగా ప్రవాస భారతీయుల శాంతి ర్యాలీ
శాన్‌ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్‌ను ధ్వంసం చేయడాన్ని ఖండిస్తూ శుక్రవారం ప్రవాస భారతీయులు శాంతి ర్యాలీ నిర్వహించారు. కాన్సులేట్ భవనం వెలుపల గుమిగూడి భారత్‌కు సంఘీభావంగా త్రివర్ణ పతాకాన్ని ప్రదర్శించారు. కాన్సులేట్ వెలుపల భారతదేశ ఐక్యతకు మద్దతుగా నిర్వహించిన శాంతి ర్యాలీకి భారీ సంఖ్యలో భారతీయ అమెరికన్లు తరలివచ్చారు. భారతీయ-అమెరికన్ కమ్యూనిటీ సిక్కు వేర్పాటువాదం, విధ్వంసక అంశాలకు వ్యవతిరేకంగా నినాదాలు చేశారు. 'వందేమాతరం' అని నినదిస్తూ త్రివర్ణ పతాకంతో పాటు అమెరికా జెండాను ర్యాలీగా ప్రదర్శించారు. కొంతమంది ఖలిస్థానీ మద్దతుదారులు ర్యాలీలో ఉన్నారన్న అనుమానంతో హింసాత్మక సంఘటనలు జరగకుండా స్థానిక పోలీసులు నిఘా పెట్టారు.
లండన్, కెనడాలోనూ ఇలాంటి ఘనటలే, మండిపడ్డ ప్రవాసులు
ఖలిస్థానీ అనుకూల నిరసనకారుల బృందం ఆదివారం కాన్సులేట్ భవనాన్ని ధ్వంసం చేసి ఉద్యోగులపై దాడికి దిగింది. సిక్కు వేర్పాటువాద ఉద్యమానికి మద్దతుగా ఖలిస్థానీ జెండాలను ఏర్పాటు చేశారు. ఈ సంఘటనను ఎన్‌ఆర్‌ఐలు తీవ్రంగా ఖండించారు. దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లండన్‌లోని భారతీయ ప్రవాసులు కూడా యూకేలోని భారత హైకమిషన్‌లో ఖలిస్తాన్ మద్దతుదారులు త్రివర్ణ పతాకాన్ని తీసివేసేందుకు ప్రయత్నించడంపై మండిపడ్డారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని ప్రవాసులు ర్యాలీ నిర్వహించారు. కెనడాలోని ఖలిస్థానీ అనుకూల, భారతదేశ వ్యతిరేక వ్యక్తులు మహాత్మా గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. అంటారియో ప్రావిన్స్‌లోని హామిల్టన్ పట్టణంలోని సిటీ హాల్ సమీపంలో విధ్వంసం జరిగింది. ఈ ఘటనపై ప్రవాస భారతీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు.