Syria: సిరియాలో అసద్ కుటుంబం వేసవి నివాసంపై ప్రజల దాడి.. సామగ్రి ధ్వంసం
సిరియాలో తిరుగుబాటుదళాలు డమాస్కస్‌ను ఆక్రమించుకున్న విషయం తెలిసిందే. దీంతో అధ్యక్షుడు బషర్ అల్ అసద్ దేశాన్ని విడిచిపోయారు. ఇక ఆయన నివాసంలోకి ప్రజలు చొరబడి, ప్లేట్లు, ఫర్నిచర్ తదితర వస్తువులను తీసుకెళ్లారు. ప్రజలు, టూరిస్టులు బుర్జ్ ఇస్లాంలోకి చేరుకుని, అసద్ కుటుంబం అక్రమంగా నిర్మించుకున్న భవనం లోపలి ఉన్న విలాసవంతమైన వస్తువులను ధ్వంసం చేశారు. వారు ఫర్నిచర్, కిటికీలను ధ్వంసం చేసి, విలువైన వస్తువులను ఎత్తుకెళ్లారు. 50 సంవత్సరాల క్రితం అసద్ కుటుంబం ఈ భవనాన్ని నిర్మించేందుకు అక్కడి ప్రజలను తరిమి వేశారన్నారు.
ప్రజల సందర్శనార్థం ఉంచాలి
అప్పటి ఆలివ్ తోటలను తరలించి, ఈ స్థలాన్ని ఒక విలాసవంతమైన ప్రైవేట్ విస్తరణగా మార్చారని స్థానికులు పేర్కొన్నారు. అసద్ దేశాన్ని విడిచిన తర్వాత, ఈ భవనంలో ఉన్న విలువైన వస్తువులను, ఆయన కుటుంబం సముద్ర మార్గం ద్వారా తరలించిందని సమాచారం. అయితే 50 సంవత్సరాల తరువాత ప్రజలు ఈ భవనాన్ని చూశారు. వారు ఇప్పుడు దీనిని మరో అధ్యక్షుడి వేసవి నివాసంగా కాకుండా, ప్రజల సందర్శనార్థం ఉంచాలని సూచించారు.