Morocco Earthquake: మొరాకోను కుదిపేసిన భారీ భూకంపం; 296 మంది మృతి
సెంట్రల్ మొరాకోను భారీ భూకంపం కుదిపేసింది. రిక్టర్ స్కేలుపై 6.8తీవ్రత నమోదైంది. శక్తమంతమైన భూకంపం కారణంగా దాదాపు 296 మంది మరణించినట్లు, డజన్ల కొద్దీ గాయపడినట్లు మొరాకో అంతర్గత మంత్రిత్వ శాఖ శనివారం తెలిపింది. గాయపడిన 153 మందిని చికిత్స కోసం ఆసుపత్రులకు తరలించారు. నగరాలు, పట్టణాల వెలుపల ఎక్కువ నష్టం సంభవించిందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. నష్టం ఏ స్థాయిలో ఉందో అధికారులు ఇంకా వెల్లడించారు. మొరాకోలో సంభవించిన పెనువిపత్తుపై ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. మొరాకోలో భూకంప ప్రమాదంలో చాలామంది ప్రాణాలు కోల్పోవడంపై ఆయన దిగ్భాంత్రిని వ్యక్తం చేశారు. ఈ కష్ట సమయంలో మొరాకోకు అన్ని విధాలా సహాయాన్ని అందించడానికి భారతదేశం సిద్ధంగా ఉందని మోదీ ట్వీట్ చేశారు.
ప్రధాని మోదీ ట్వీట్
యునెస్కో గుర్తింపు పొందిన భవనాలు నేలమట్టం
సెంట్రల్ మొకారో ప్రావిన్షియల్ ప్రాంతాల్లో భూకంప కేంద్రానికి సమీపంలోనే ఎక్కువ ప్రాణనష్టం సంభవించినట్లు అంతర్గత మంత్రిత్వ శాఖ తెలిపింది. భూకంప కేంద్రం 18.5 కి.మీ లోతులో ఉందని, మరకేష్‌కు నైరుతి దిశలో 72 కి.మీ (44 మైళ్ళు), ఔకైమెడెన్ పట్టణానికి పశ్చిమాన 56 కి.మీ (సుమారు 35 మైళ్లు) దురంలో ప్రకంపనలు సంభవించినట్లు నివేదిక పేర్కొంది. యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే ప్రకారం, రాత్రి 11 గంటల తర్వాత భూకంపం సభవించింది. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందిన 'ఓల్డ్ సిటీ'లోని కొన్ని భవనాలు ఆ రోజు కూలిపోయాయని అధికారులు తెలిపారు. చేరుకోవడానికి కష్టంగా ఉన్న పర్వత ప్రాంతాల్లోనే అత్యధిక మరణాలు సంభవించినట్లు వెల్లడించారు.