LOADING...
Asim Munir: పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌పై మొసాద్ హత్యాయత్నం? బ్రెజిల్ జర్నలిస్ట్ సంచలన ఆరోపణలు
బ్రెజిల్ జర్నలిస్ట్ సంచలన ఆరోపణలు

Asim Munir: పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌పై మొసాద్ హత్యాయత్నం? బ్రెజిల్ జర్నలిస్ట్ సంచలన ఆరోపణలు

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 25, 2026
10:04 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారే మరో సంచలన ఆరోపణ వెలుగులోకి వచ్చింది. స్విట్జర్లాండ్‌లో జరిగిన ఇరాన్-అమెరికా శాంతి చర్చలకు హాజరైన పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్‌ను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ గూఢచార సంస్థ మొసాద్ దాడికి ప్రణాళిక రూపొందించిందని బ్రెజిల్‌కు చెందిన ప్రముఖ జర్నలిస్ట్, భౌగోళిక రాజకీయాల విశ్లేషకుడు పేపే ఎస్కోబార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మారియో నౌఫల్‌తో'ఎక్స్'సోషల్ మీడియా వేదికగా నిర్వహించిన ఇంటర్వ్యూలో మాట్లాడిన పేపే ఎస్కోబార్ ఈ ఆరోపణలు చేశారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఆదేశాల మేరకు,స్విట్జర్లాండ్‌కు వెళ్తున్న పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌తో పాటు పాకిస్తాన్ ప్రతినిధి బృందాన్ని లక్ష్యంగా చేసుకుని మొసాద్ హత్యాయత్నానికి ప్రణాళిక సిద్ధం చేసిందని ఆయన పేర్కొన్నారు.

వివరాలు 

ఇజ్రాయెల్‌కు పాకిస్తాన్ గట్టి హెచ్చరిక?

అయితే, ఈ కుట్రకు సంబంధించిన అత్యంత విశ్వసనీయ సమాచారాన్ని పాకిస్తాన్ మిలిటరీ ఇంటెలిజెన్స్ ముందుగానే గుర్తించి ఆ ప్రయత్నాన్ని అడ్డుకుందని ఆయన వెల్లడించారు. ఈ కుట్రపై సమాచారం అందుకున్న వెంటనే పాకిస్తాన్ దౌత్యపరమైన మధ్యవర్తుల ద్వారా ఇజ్రాయెల్‌కు నేరుగా కఠిన హెచ్చరిక పంపినట్లు పేపే ఎస్కోబార్ తెలిపారు. తమకు అందిన సమాచారం ప్రకారం, ఒమన్ మధ్యవర్తిత్వంతో ఇజ్రాయెల్‌కు సందేశం పంపిన పాకిస్తాన్.. ఒకవేళ తమ ప్రతినిధి బృందంపై దాడి జరిగితే తీవ్ర ప్రతిస్పందన తప్పదని స్పష్టం చేసినట్లు ఆయన వ్యాఖ్యానించారు.

వివరాలు 

అధికారికంగా ఎలాంటి ధృవీకరణ లేదు

అయితే, ఆసిమ్ మునీర్‌పై హత్యాయత్నం జరిగినట్లు వస్తున్న ఆరోపణలపై ఇప్పటివరకు ఇజ్రాయెల్ గానీ, పాకిస్తాన్ గానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అలాగే సమావేశానికి ఆతిథ్యం ఇచ్చిన స్విట్జర్లాండ్ భద్రతా సంస్థలు లేదా అమెరికా కూడా ఇలాంటి ముప్పుపై ఎలాంటి అధికారిక హెచ్చరికలు లేదా వివరాలు వెల్లడించలేదు.

Advertisement

వివరాలు 

శాంతి చర్చల సమయంలోనే ఘటన జరిగిందా?

అమెరికా-ఇరాన్ శాంతి ప్రయత్నాల్లో భాగంగా గత వారం స్విట్జర్లాండ్‌లోని ముంగెన్‌స్టాక్‌లో జరిగిన చర్చలకు హాజరయ్యేందుకు పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌తో కూడిన ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం అక్కడికి వెళ్లింది. ఆ సమయంలోనే ఈ హైడ్రామా చోటుచేసుకున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఆరోపణలకు ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ఆధారాలు వెలువడనప్పటికీ, అంతర్జాతీయ దౌత్య వర్గాల్లో మాత్రం ఇవి తీవ్ర చర్చకు దారితీశాయి. ఇటీవలి కాలంలో ఇజ్రాయెల్-పాకిస్తాన్ మధ్య అంతర్గత ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

Advertisement