SriLankan Airlines: గాల్లోనే పిడుగుపాటుకు గురైన విమానం.. పైలట్ల చాకచక్యంతో తప్పిన పెను ప్రమాదం!
ఈ వార్తాకథనం ఏంటి
కొలంబో నుంచి ఆస్ట్రేలియాలోని సిడ్నీకి బయలుదేరిన శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్ విమానం గాల్లోనే పిడుగుపాటుకు గురై అత్యవసర పరిస్థితిని ఎదుర్కొంది. అయితే పైలట్ల అప్రమత్తతతో విమానాన్ని సురక్షితంగా తిరిగి కొలంబో విమానాశ్రయానికి తీసుకురావడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. శుక్రవారం కొలంబో విమానాశ్రయం నుంచి యూఎల్606 శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్ విమానం సిడ్నీకి బయలుదేరింది. విమానంలో 207 మంది ప్రయాణికులతో పాటు 16 మంది సిబ్బంది ఉన్నారు. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే భారీ శబ్దం వినిపించడంతో పాటు విమానంలోని ఒక ఇంజిన్ నుంచి మంటలు కనిపించాయి. దీంతో ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. పరిస్థితిని గమనించిన సిబ్బంది వెంటనే అప్రమత్తమై ప్రయాణికులను శాంతింపజేస్తూ పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు.
వివరాలు
ఇంజిన్‌కు స్వల్ప నష్టం
అనంతరం పైలట్లు విమానం పిడుగుపాటుకు గురైందని, దాని ప్రభావంతో ఒక ఇంజిన్‌కు స్వల్ప నష్టం వాటిల్లిందని వివరించారు. అయితే ఎలాంటి ప్రమాదం లేదని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రయాణికులకు భరోసా ఇచ్చారు. ముందుజాగ్రత్త చర్యగా విమానాన్ని తిరిగి కొలంబోకు మళ్లించాలని నిర్ణయించిన పైలట్లు, విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనపై శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్ స్పందిస్తూ, ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా విమానాన్ని వెనక్కి తీసుకురావాల్సి వచ్చిందని తెలిపింది. విమానం సురక్షితంగా ల్యాండ్ అయిందని, ప్రయాణికుల ప్రయాణానికి అంతరాయం కలగకుండా ప్రత్యామ్నాయంగా మరో విమానాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది.
వివరాలు
ఆధునిక విమానాల్లో ప్రత్యేక రక్షణ వ్యవస్థలు
విమానయాన నిపుణుల ప్రకారం, గాల్లో ప్రయాణిస్తున్న సమయంలో విమానాలు పిడుగుపాటుకు గురికావడం అరుదైన విషయం కాదు. అయితే ఆధునిక విమానాల్లో ప్రత్యేక రక్షణ వ్యవస్థలు ఉంటాయి. పిడుగు వల్ల ఉత్పన్నమయ్యే విద్యుత్ ప్రవాహం విమానం లోపలికి చేరకుండా, ప్రయాణికులు, సిబ్బందికి ఎలాంటి హాని కలగకుండా ప్రత్యేక నిర్మాణంతో వాటిని తయారు చేస్తారు. అందువల్ల చాలా సందర్భాల్లో పిడుగుపాటు జరిగినా విమాన భద్రతపై పెద్దగా ప్రభావం ఉండదు.