LOADING...
G7 Summit: జీ7 సదస్సులో భారత నావికుల మృతిని ప్రస్తావించిన ప్రధాని మోదీ.. ట్రంప్ ఎదుట ఆందోళన
ట్రంప్ ఎదుట ఆందోళన

G7 Summit: జీ7 సదస్సులో భారత నావికుల మృతిని ప్రస్తావించిన ప్రధాని మోదీ.. ట్రంప్ ఎదుట ఆందోళన

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 17, 2026
08:01 am

ఈ వార్తాకథనం ఏంటి

ఒమన్ తీర ప్రాంతంలో భారతీయులు ఉన్న వాణిజ్య నౌకపై అమెరికా దాడులు జరగడం, ఆ ఘటనలో ముగ్గురు భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోవడం దేశవ్యాప్తంగా విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనలో డెక్ క్యాడెట్ ఆదిత్య శర్మ, ఇంజిన్ ఫిట్టర్ శివానంద్ చౌరాసియా, చీఫ్ ఇంజినీర్ పట్నాల సురేష్ మృతి చెందారు. ఫ్రాన్స్‌లోని ఎవియాన్‌లో జరుగుతున్న జీ7 (G7) సదస్సులో మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఘటనను ప్రస్తావించారు. అంతర్జాతీయ వాణిజ్య నౌకలపై జరిగిన క్షిపణి దాడుల్లో భారతీయులు ప్రాణాలు కోల్పోవడం పట్ల ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమక్షంలోనే ఈ అంశాన్ని ప్రస్తావించడం విశేషం.

వివరాలు 

పశ్చిమాసియాలో శాంతి అవసరం: మోదీ

జీ7 సదస్సులో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. పశ్చిమాసియా ప్రాంతంలో శాంతి స్థాపన కోసం జరుగుతున్న ప్రయత్నాలను భారత్ స్వాగతిస్తోందని చెప్పారు. ఇరాన్-అమెరికా మధ్య నెలకొన్న ఘర్షణలు ఆ ప్రాంతంలోని మిత్రదేశాలపై ప్రభావం చూపడంతో పాటు ప్రాణ, ఆస్తి నష్టానికి దారితీశాయని పేర్కొన్నారు. ఒమన్ తీరంలో జరిగిన నౌక దాడిలో పలువురు భారతీయ పౌరులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని ఆయన అన్నారు. ప్రపంచ దేశాలను సముద్ర వాణిజ్యం ద్వారా అనుసంధానించే నావికుల భద్రతను కాపాడటం అంతర్జాతీయ సమాజం బాధ్యత అని స్పష్టం చేశారు. సముద్ర మార్గాలు అన్ని వేళలా సురక్షితంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, ఎలాంటి భయాందోళనలు లేకుండా నావికులు తమ విధులు నిర్వహించుకునే పరిస్థితులు కల్పించాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.

వివరాలు 

16 నెలల తర్వాత మోదీ-ట్రంప్ ముఖాముఖి

జీ7 సదస్సు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దాదాపు 16 నెలల తర్వాత ప్రత్యక్షంగా కలుసుకున్నారు. ఇద్దరు నేతలు ఆత్మీయంగా పలకరించుకుని కొద్దిసేపు చర్చించారు. సదస్సులో వీరిద్దరూ పక్కపక్కనే కూర్చోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బుధవారం మోదీ, ట్రంప్ మధ్య ద్వైపాక్షిక సమావేశం జరగనుంది. ఈ భేటీలో భారత్-అమెరికా సంబంధాల బలోపేతం, ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, భద్రతా అంశాలు, ప్రాంతీయ పరిణామాలతో పాటు కీలక అంతర్జాతీయ అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Advertisement