నేడు బోయింగ్, అమెజాన్, గూగుల్ సీఈవోలతో ప్రధాని మోదీ సమావేశం
అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ బిజీబిజీగా గడుపుతున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెమీకండక్టర్స్, స్పేస్‌తో సహా వివిధ సాంకేతిక రంగాల్లో ఆవిష్కరణలు, పెట్టుబడులు, తయారీ గురించి చర్చించడానికి ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం(భారత కాలామానం ప్రకారం) వైట్‌హౌస్‌లో భారతీయ, అమెరికన్ సంస్థల చీఫ్ ఎగ్జిక్యూటివ్‌లతో సమావేశం కానున్నారు. ముఖ్యంగా బోయింగ్, అమెజాన్, గూగుల్ సీఈఓలు, సహా అగ్రశ్రేణి వ్యాపార నాయకులతో ప్రధాని మోదీ భేటీ కానున్నారు. సమావేశం అనంతరం ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ ప్రధాని మోదీకి ఆతిథ్యం ఇవ్వనున్నారు.
భారత్‌లో 100 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనున్న బోయింగ్
భారతదేశంలోని పైలట్‌లకు శిక్షణ ఇచ్చే మౌలిక సదుపాయాలు, కార్యక్రమాలపై విమానాల తయారీ సంస్థ 100 మిలియన్ డాలర్ల పెట్టుబడిని ప్రకటించిన ఒక రోజు తర్వాత బోయింగ్ సీఈఓ డేవ్ కాల్‌హౌన్‌తో మోదీ సమావేశం కానున్నారు. బోయింగ్ నుంచి ఈ వారం ప్రారంభంలో 200 జెట్‌ల ఆర్డర్‌లపై ఎయిర్ ఇండియా సంతకం చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే, సాంకేతికత సహకారం విషయంలో కూడా రెండు దేశాలు పరస్పరం కలిసి పనిచేస్తాయని భారత విదేశాంగ కార్యదర్శి వినయ్ క్వాత్రా చెప్పారు. యూఎస్ కాంగ్రెస్ సంయుక్త సమావేశంలో ప్రధాని గురువారం చారిత్రక ప్రసంగం చేశారు.