Loading...
Japan Earthquake: జపాన్‌ను వణికించిన భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 5.7 తీవ్రత!
జపాన్‌ను వణికించిన భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 5.7 తీవ్రత!

Japan Earthquake: జపాన్‌ను వణికించిన భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 5.7 తీవ్రత!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 08, 2026
11:52 am

ఈ వార్తాకథనం ఏంటి

జపాన్‌ను మరోసారి భూకంపం వణికించింది. ఆదివారం (నవంబర్ 8) తెల్లవారుజామున ఒంటి గంట ప్రాంతంలో షిజువోకా ప్రిఫెక్చర్ పశ్చిమ భాగంలో బలమైన భూకంపం సంభవించింది. జపాన్ వాతావరణ సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం.. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.7గా నమోదైంది. భూకంప కేంద్రం భూమికి సుమారు 40 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఐచి, నగానో, గిఫు ప్రిఫెక్చర్‌లలోనూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. దీంతో పలు ప్రాంతాలు ఒక్కసారిగా కంపించాయి.

వివరాలు

భయంతో ఇళ్ల నుంచి పరుగులు తీసిన ప్రజలు

భూప్రకంపనల ధాటికి ప్రభావిత ప్రాంతాల్లోని ఇళ్లు, దుకాణాల కిటికీల అద్దాలు పగిలిపోయాయి. అర్ధరాత్రి గాఢ నిద్రలో ఉన్న ప్రజలు ఒక్కసారిగా భూమి కంపించడంతో భయాందోళనకు గురయ్యారు.

వెంటనే ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ భూకంపం కారణంగా కనీసం 22 మంది గాయపడినట్లు అధికారులు వెల్లడించారు.

ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టారు. అయితే, ఎలాంటి సునామీ హెచ్చరికలు జారీ చేయలేదు.

వివరాలు

తక్కువ వేగంతో బుల్లెట్ రైళ్ల రాకపోకలు

భూకంపం కారణంగా రైల్వే మౌలిక సదుపాయాలు దెబ్బతినే అవకాశం ఉందనే ఆందోళనలతో అధికారులు ముందుజాగ్రత్త చర్యలు చేపట్టారు.

ఇందులో భాగంగా ప్రభావిత ప్రాంతాల్లో బుల్లెట్ రైళ్లను తక్కువ వేగంతో నడుపుతున్నారు. భూకంప ప్రభావిత ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

భూప్రకంపనలతో పలు భవనాలు చిగురుటాకులా వణికిపోతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ADVERTISEMENT