లాస్ ఏంజిల్స్: ప్రైవేట్ జెట్ క్రాష్, ఆరుగురు మృతి
కాలిఫోర్నియా లాస్ ఏంజిల్స్‌లోని విమానాశ్రయం సమీపంలోని శనివారం ఓ ప్రైవేట్ జెట్ క్రాష్ అయ్యింది. ఈ విమాన ప్రమాదంలో ఆరుగురు మరణించినట్లు ఫెడరల్ అధికారులు తెలిపారు. లాస్ వెగాస్ నుంచి బయలుదేరిన Cessna C550 బిజినెస్ జెట్ విమానం లాస్ ఏంజిల్స్‌కు దక్షిణంగా ఉన్న రివర్‌సైడ్ కౌంటీలోని ఫ్రెంచ్ వ్యాలీ విమానాశ్రయం సమీపంలో ఉదయం 4:15 గంటలకు కూలిపోయింది. ప్రైవేట్ జెట్‌లో మంటలు చెలరేగడం వల్ల అందరూ చనిపోయారని అధికారులు వెల్లడించారు. మరణించిన అందరూ మేజర్లే అని నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్‌లోని ఏవియేషన్ ఇన్వెస్టిగేటర్ ఇలియట్ సింప్సన్ తెలిపారు. విమానం కూలిపోయిన తర్వాత దాని తోక తప్ప మిగిలిన అన్నింటిలోనూ మంటలు వ్యాపించాయని సింప్సన్ వెల్లడించారు.
ప్రైవెట్ జెట్ క్రాష్‌పై దర్యాప్తు
రహదారి పక్కన ఉన్న ఒక పొలంలో కూలిన విమానం శిథిలాలను గుర్తించినట్లు ఎరియల్ సర్వే అధికారులు తెలిపారు. ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్‌సైట్ నుంచి రాడార్ డేటా సమాచారం ప్రకారం, జెట్ ప్రమాదానికి గురైన సమయంలో లాస్ వెగాస్ నుంచి ఫ్రెంచ్ వ్యాలీకి కేవలం ఒక వ్యాపార జెట్ ప్రయాణిస్తున్నట్లు చూపిస్తుంది. ఆ విమానం దిగే ముందు మైదానం సమీపంలో ఒక్కసారి చక్కర్లు కొట్టింది. నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగిస్తోంది. జూలై 4న అదే విమానాశ్రయానికి సమీపంలో నలుగురు ప్రయాణికులతో కూడిన చిన్న విమానం కూలిపోయి ఘటనలో పైలట్ మృతి చెందగా, ముగ్గురు యువకులు గాయపడినట్లు అధికారులు తెలిపారు.