China: చైనా ఈస్టర్న్ విమాన ప్రమాదంపై కొత్త అనుమానాలు.. అమెరికా సంచలన ఆరోపణలు
ఈ వార్తాకథనం ఏంటి
కరోనా పుట్టుక విషయంలో చైనాపై అగ్రరాజ్యం అమెరికా సంచలన ఆరోపణలకు దిగింది. వుహాన్ ప్రయోగశాలలోనే వైరస్ పుట్టిందని చెప్పినా, దీనికి సరైన ఆధారాలు మాత్రం చూపలేకపోయింది. ఈ నేపథ్యంలో మరో అంశంలోనూ చైనా గోప్యత పాటిస్తోందని అమెరికా వెల్లడించింది. దాచిన సమాచారం ఇప్పుడు బయటపడిందని చెబుతోంది. 2022 మార్చి 21న చైనా ఈస్టర్న్ విమానం MU5735 గ్వాంగ్సీ ప్రాంతంలోని కొండల్లో కూలిపోయింది. ఈ ప్రమాదంలో 132 మంది ప్రాణాలు కోల్పోయారు. విమానం 49 వేల ముక్కలు కావడంతో.. వాటి సేకరణకు పెద్ద ఎత్తున సిబ్బందిని వినియోగించారు. చైనాలో గత కొన్ని దశాబ్దాల్లో చోటుచేసుకున్న అతిపెద్ద విమాన ప్రమాదంగా ఇది నిలిచింది. అయితే ఈ ఘటనకు గల కారణాలను చైనా ఇప్పటివరకు వెల్లడించలేదు.
వివరాలు
ఇంజిన్ వేగం తగ్గి విమానం కిందికి పడిపోయిన విమానం
ఈ ఘటనపై తాజాగా అమెరికా జాతీయ రవాణా భద్రతా మండలి ఒక కీలక నివేదిక విడుదల చేసింది. ఈ ప్రమాదం సహజంగా జరగలేదని, కాక్‌పిట్‌లో ఎవరో ఉద్దేశపూర్వకంగా ఇంధన సరఫరాను నిలిపివేశారని పేర్కొంది. విమాన డేటా నమోదు పరికరం విశ్లేషణలో, విమానం 29 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న సమయంలో రెండు ఇంజిన్ల ఇంధన స్విచ్‌లు ఒకేసారి నడుస్తున్న స్థితి నుంచి నిలిపివేసే స్థితికి మార్చబడ్డాయని వెల్లడైంది. దీంతో ఇంజిన్ వేగం తగ్గి విమానం ఒక్కసారిగా కిందికి పడిపోయింది. ఇది అనుకోకుండా జరిగి ఉంటే పైలట్లు వెంటనే స్పందించి సమస్యను సరిచేసేవారని నిపుణుడు డేవిడ్ సౌసీ అభిప్రాయపడ్డారు. కానీ అలాంటి ప్రయత్నం జరగలేదని తెలిపారు.
వివరాలు
2024లో విడుదల చేసిన నివేదికలో..
కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ (CVR) బ్యాటరీ బ్యాకప్‌తో చివరి క్షణాలను రికార్డు చేసినప్పటికీ.. ఆ ఆడియో ఫైళ్లను అమెరికా అధికారులు చైనా సివిల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (CAAC)కి పంపారు అయితే చైనా అధికారులు ఇప్పటివరకు ఈ ప్రమాదం ఉద్దేశపూర్వకమని అంగీకరించలేదు. 2024లో విడుదల చేసిన నివేదికలో అన్ని వ్యవస్థలు సవ్యంగానే ఉన్నాయని పేర్కొన్నారు. ఇక 2022లో ఒక ప్రముఖ అంతర్జాతీయ ఆర్థిక పత్రిక కూడా విమానం కాక్‌పిట్‌లో ఇచ్చిన ఆదేశాల వల్లే కూలిపోయిందని కథనం ప్రచురించింది. ఇది పైలట్ ఆత్మహత్య చర్యా, లేక మరెవరైనా కాక్‌పిట్‌లో జోక్యం చేసుకున్నారా అన్న ప్రశ్నలు ఇంకా స్పష్టతకు రాలేదు. అసలు నమోదు పరికరాల సమాచారాన్ని చైనా ఎందుకు పూర్తిగా బయటపెట్టడం లేదన్న విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి.