నన్ను చంపుతానని పుతిన్ బెదిరించారు: బోరిస్ జాన్సన్
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తనను చంపేస్తానని బెదిరించారని బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ ఆరోపించారు. యూకేపై క్షిపణిని వదలడానికి తనకు ఒక నిమిషం మాత్రమే పడుతుందని పుతిన్ హెచ్చిరినట్లు జాన్సన్ వెల్లడించారు. బీబీసీ రూపొందించిన 'పుతిన్ v ది వెస్ట్' అనే మూడు భాగాల డాక్యుమెంటరీలో ఈ సంచలన విషయాలను వెల్లడయ్యాయి. ఉక్రెయిన్‌పై యుద్ధానికి వెళ్లడానికి ముందు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తనకు కాల్ చేసి ఈ బెదిరింపులకు పాల్పడినట్లు బోరిస్ జాన్సన్ డాక్యుమెంటరీలో చెప్పారు. అయితే పుతిన్ బెదిరింపులకు తాను భయపడలేదని, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీకి మద్దతుగా తాను గట్టిగా బదులిచ్చినట్లు పేర్కొన్నారు.
పశ్చిమ దేశాల కఠిన ఆంక్షలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించా: జాన్సన్
ఇప్పుడైతే నాటోలో ఉక్రెయిన్ చేరడం లేదని, ఒక వేళ ఉక్రెయిన్ ఆక్రమణకు రష్యా పాల్పడితే పశ్చిమ దేశాల కఠిన ఆంక్షలను ఎదుర్కోవాల్సి ఉంటుందని తాను పుతిన్‌ను హెచ్చిరించినట్లు జాన్సన్ పేర్కొన్నారు. అయితే ఉక్రెయిన్ ఇప్పుడు చేరడం లేదంటే, భవిష్యత్‌లో చేరుతుందా అనే కోణంలో పుతిన్ తనను అడిగినట్లు జాన్సన్ చెప్పారు. భవిష్యత్‌లో కూడా ఉక్రెయిన్ నాటోలో చేరడం లేదని, 'అది మీకు కూడా బాగా తెలుసు' అని పుతిన్‌తో తాను చెప్పినట్లు జాన్సన్ వెల్లడించారు. ఈ ఫోన్ కాల్ సంభాషణ జరిగిన కొన్ని రోజులకే 2022 ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌పై పుతిన్ సైనిక చర్యను ప్రకటించారు. ఇది ఇరు దేశాల మధ్య సుదీర్ఘ యుద్ధానికి దారి తీసింది.