Page Loader
DeepSeek: అరుణాచల్ ప్రదేశ్‌పై ప్రశ్న.. 'డీప్‌సీక్‌' చెప్పిన సమాధానం నెట్టింట వైరల్!
అరుణాచల్ ప్రదేశ్‌పై ప్రశ్న.. 'డీప్‌సీక్‌' చెప్పిన సమాధానం నెట్టింట వైరల్!

DeepSeek: అరుణాచల్ ప్రదేశ్‌పై ప్రశ్న.. 'డీప్‌సీక్‌' చెప్పిన సమాధానం నెట్టింట వైరల్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 28, 2025
02:03 pm

ఈ వార్తాకథనం ఏంటి

కృత్రిమ మేధా రంగంలో సంచలనంగా మారిన చైనా ఏఐ స్టార్టప్‌ డీప్‌సీక్‌ ప్రస్తుతం టెక్‌ ఇండస్ట్రీలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఓపెన్‌ ఏఐ, గూగుల్, మైక్రోసాఫ్ట్‌ వంటి దిగ్గజ సంస్థలకు పోటీగా తక్కువ ఖర్చుతో ఏఐ మోడల్‌ను అందుబాటులోకి తెచ్చిన ఈ సంస్థ తాజాగా వివాదంలో చిక్కుకుంది. భారతదేశంలోని అరుణాచల్ ప్రదేశ్‌పై అడిగిన ప్రశ్నకు డీప్‌సీక్‌ చాట్‌బాట్‌ ఇచ్చిన సమాధానం నెట్టింట వైరల్‌గా మారింది. హాంగ్జౌకు చెందిన డీప్‌సీక్‌ సంస్థ ఇటీవల 'ఆర్‌1' పేరుతో కొత్త ఏఐ మోడల్‌ను ఆవిష్కరించింది.

Details

ఇది నా పరిధి దాటి ఉన్న విషయం

దీనిలో రిజిస్టర్‌ చేసుకున్న ఓ యూజర్‌ 'అరుణాచల్ ప్రదేశ్‌' అని టైప్‌ చేశారు. అయితే, చాట్‌బాట్‌ దీనికి 'ఇది నా పరిధికి దాటి ఉన్న అంశం. వేరే ఏదైనా చర్చిద్దాం'' అని సమాధానం చెప్పింది. ఆ యూజర్‌ మళ్లీ 'భారతదేశ ఈశాన్య రాష్ట్రాల పేర్లు చెప్పండి' అని అడగగా, చాట్‌బాట్‌ మళ్లీ అదే సమాధానం ఇచ్చింది. ప్రస్తుతం ఈ స్క్రీన్ షాట్లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తాజాగా డీప్‌సీక్‌ తమ ఆర్‌1 మోడల్‌ ఉచితంగా అందుబాటులోకి తెచ్చింది. ఇది ఏఐ రంగంలో కొత్త సంచలనానికి దారి తీసింది.

Details

ఉచిత సేవల ద్వారా వినియోగదారులను ఆకర్షిస్తున్న డీప్ సీక్

ఓపెన్‌ఏఐ లేదా క్లాడ్‌ సోనెట్‌ వంటి సంస్థలు సబ్‌స్క్రిప్షన్‌ రూపంలో ఛార్జీలు వసూలు చేస్తున్న సమయంలో, డీప్‌సీక్‌ ఉచిత సేవల ద్వారా వినియోగదారులను ఆకర్షిస్తోంది. చాట్‌.డీప్‌సీక్‌.కామ్‌ వెబ్‌సైట్‌లోకి వెళ్లి మెయిల్ ఐడీతో లాగిన్‌ అవ్వడం ద్వారా ఈ చాట్‌బాట్‌ను వినియోగించుకోవచ్చు. లాగిన్‌ చేసిన వెంటనే డాల్ఫిన్‌ లోగోతో కూడిన చాట్‌పేజీ తెరుచుకుంటుంది. ఇది వెబ్‌పేజీ, యాప్‌, ఏపీఐ రూపాల్లో అందుబాటులో ఉండగా, ఇంటర్‌ఫేస్ పరంగా చాట్‌జీపీటీని పోలి ఉంటుంది.