LOADING...
Iran: బుషెహర్ అణు ప్లాంట్‌కు ముప్పు.. రేడియేషన్ లీకేజీపై IAEA హెచ్చరిక
బుషెహర్ అణు ప్లాంట్‌కు ముప్పు.. రేడియేషన్ లీకేజీపై IAEA హెచ్చరిక

Iran: బుషెహర్ అణు ప్లాంట్‌కు ముప్పు.. రేడియేషన్ లీకేజీపై IAEA హెచ్చరిక

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 27, 2026
01:13 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇరాన్‌లోని బుషెహర్ అణు విద్యుత్ కేంద్రంలో రేడియేషన్ లీకేజీ ప్రమాదం పొంచి ఉందన్న భయాలపై అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (IAEA) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ప్లాంట్‌లో భారీగా అణు పదార్థాలు నిల్వ ఉన్నాయని ఐఏఈఏ డైరెక్టర్ జనరల్ రఫేల్ గ్రూసి వెల్లడించారు. బుషెహర్ ప్లాంట్‌లో నిల్వ ఉన్న అణు పదార్థాల పరిమాణం దృష్ట్యా ఏదైనా ప్రమాదం జరిగితే పరిస్థితి అత్యంత తీవ్రంగా మారే అవకాశముందని గ్రూసి హెచ్చరించారు. రేడియేషన్ లీకేజీ జరిగితే అది ఇరాన్‌కే కాకుండా పరిసర దేశాలకూ వ్యాపించే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ఈ పరిస్థితిని 'రేడియాలాజికల్ యాక్సిడెంట్'గా అభివర్ణిస్తూ, దాని ప్రభావం విస్తృతంగా ఉంటుందని తెలిపారు.

వివరాలు 

అన్ని దేశాలు సంయమనం పాటించాలి

ఇలాంటి విపత్తును నివారించాలంటే సంబంధిత దేశాలు బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని గ్రూసి సూచించారు. ఉద్రిక్త పరిస్థితుల్లో కూడా అన్ని పక్షాలు సంయమనం పాటించాలని ఆయన పిలుపునిచ్చారు. ఇటీవల ఇరాన్ సైనిక స్థావరాలు, క్షిపణి తయారీ కేంద్రాలు, ఆయుధ గోదాములపై ఇజ్రాయెల్-అమెరికా సంయుక్త దాడులు కొనసాగుతున్నాయి. ఈ దాడుల్లో బుషెహర్ ప్రావిన్స్‌లోని ఐఆర్‌జీసీ నేవీ, ఎయిర్ బేస్‌ల మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నట్లు శాటిలైట్ చిత్రాలు సూచిస్తున్నాయి. ఈ దాడులు అణు ప్లాంట్‌కు సమీప ప్రాంతాల్లోనే జరిగినట్లు సమాచారం రావడంతో రేడియేషన్ లీకేజీపై భయాలు మరింత పెరిగాయి. ఇదే సమయంలో అక్కడ పనిచేస్తున్న తమ సిబ్బందిని రష్యా ఇప్పటికే వెనక్కి తరలించినట్లు తెలుస్తోంది.

Advertisement