Raja Krishnamoorthi: భారత్ వ్యతిరేక నినాదాలపై రాజా కృష్ణమూర్తి ఆవేదన.. ఐక్యతకు పిలుపు
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికాలో భారత్‌కు వ్యతిరేకంగా విద్వేషపూరిత ఘటనలు పెరుగుతున్నాయంటూ భారత సంతతికి చెందిన అమెరికా కాంగ్రెస్ సభ్యుడు రాజా కృష్ణమూర్తి ఆందోళన వ్యక్తం చేశారు. సమాజంలో విద్వేషాలను రెచ్చగొట్టే చర్యలకు తావివ్వకుండా, పరస్పర గౌరవం, ఐక్యతను కాపాడాలని అమెరికన్లకు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమాల వేదికగా తన అభిప్రాయాలను వెల్లడించారు. డెమోక్రటిక్ పార్టీకి చెందిన రాజా కృష్ణమూర్తి ప్రస్తుతం అమెరికాలోని ఇల్లినోయిస్ రాష్ట్రం ఎనిమిదో కాంగ్రెస్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అమెరికాలో భారత్‌కు వ్యతిరేకంగా పెరుగుతున్న విద్వేష ధోరణులపై అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ఇటీవల, రెండు వారాల క్రితం టెక్సాస్ రాష్ట్రంలోని ఫ్రిస్కో నగరంలో కొందరు వ్యక్తులు భారత్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేసిన ఘటనను ఆయన ప్రస్తావించారు.
వివరాలు
జాతి,మతం, వంశం, దేశం అనే తేడా లేకుండా అందరికీ సమాన గౌరవం లభించాలి
"భారతదేశానికి తిరిగి వెళ్లండి..టెక్సాస్‌ను ఆక్రమించడం ఆపండి..మా స్థానాలను మరెవ్వరూ భర్తీ చేయలేరు"అంటూ భారతీయులను లక్ష్యంగా చేసుకుని వ్యాఖ్యలు చేసినట్లు గుర్తుచేశారు. ఇలాంటి విద్వేషపూరిత వ్యాఖ్యలు అమెరికా విలువలకు విరుద్ధమని రాజా కృష్ణమూర్తి స్పష్టం చేశారు. జాతి,మతం, వంశం, దేశం అనే తేడా లేకుండా అందరికీ సమాన గౌరవం లభించాల్సిన అవసరం ఉందన్నారు. అమెరికాలో విద్వేషం, వివక్షకు ఎలాంటి స్థానం లేదని, సమాజంలో ఐక్యతను బలోపేతం చేస్తూ పరస్పర సహకారంతో ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. అమెరికా ప్రజలు విద్వేషం, వివక్షలకు దూరంగా ఉంటూ సామరస్యాన్ని కాపాడేందుకు కృషి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేసిన రాజా కృష్ణమూర్తి, భిన్న సంస్కృతులు, వర్గాల మధ్య పరస్పర గౌరవ భావన మరింత బలపడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
రాజా కృష్ణమూర్తి చేసిన ట్వీట్
“Go back to India.” “You will not replace us.”
— Congressman Raja Krishnamoorthi (@CongressmanRaja) June 18, 2026
Those were the chants of white supremacists outside a Texas city hall just weeks ago. Whether directed at Hindus, Muslims, Jews, or any other community, hate has no place in America. We must stand shoulder-to-shoulder against… pic.twitter.com/gSm3QWjFWj