LOADING...
Iran: గల్ఫ్ దేశాల్లో స్టార్‌లింక్‌పై ఇరాన్ కన్ను.. భారీ దాడుల హెచ్చరిక
గల్ఫ్ దేశాల్లో స్టార్‌లింక్‌పై ఇరాన్ కన్ను.. భారీ దాడుల హెచ్చరిక

Iran: గల్ఫ్ దేశాల్లో స్టార్‌లింక్‌పై ఇరాన్ కన్ను.. భారీ దాడుల హెచ్చరిక

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 01, 2026
11:54 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికాతో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్ తన దాడుల వ్యూహాన్ని మరింత తీవ్రతరం చేస్తోంది. ముఖ్యంగా అమెరికా మిత్ర దేశాల్లో ఉన్న కీలక మౌలిక సదుపాయాలపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను నేరుగా లక్ష్యంగా చేసుకుని దాడులు చేపడతామని ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC)హెచ్చరికలు జారీ చేసింది. బహ్రెయిన్‌,కువైట్‌,యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) వంటి గల్ఫ్ దేశాల్లో స్టార్‌లింక్ సేవలు కొనసాగుతున్నాయి. ఈ దేశాల్లో అమెరికా మిత్రత్వం ఉన్న నేపథ్యంలో అక్కడి మౌలిక వసతులను దెబ్బతీయడం తమ లక్ష్యమని IRGC స్పష్టం చేసింది. పరిస్థితులు మరింత విషమిస్తే,గల్ఫ్ ప్రాంతంలో స్టార్‌లింక్‌కు సంబంధించిన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను పూర్తిగా ధ్వంసం చేస్తామని కూడా హెచ్చరించింది.

వివరాలు 

18 సంస్థల మౌలిక సదుపాయాల టార్గెట్

ఇదే సమయంలో, ఇజ్రాయెల్‌తో సంబంధాలు కలిగిన అమెరికా టెక్ కంపెనీలను కూడా ఇరాన్ లక్ష్యంగా చేసుకుంటోంది. ఇప్పటికే దాదాపు 18 సంస్థల మౌలిక సదుపాయాలను టార్గెట్ చేసినట్లు సమాచారం. ఇరాన్ దాడుల కారణంగా కొన్ని ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలు నిలిచిపోవడం, బ్లాక్‌అవుట్ పరిస్థితులు ఏర్పడటం సాధారణమైపోయింది. ఈ సమస్యను అధిగమించేందుకు గల్ఫ్ దేశాలు స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్‌ను విస్తృతంగా ఉపయోగిస్తున్నాయి.

వివరాలు 

అమెరికాకు చెందిన పలు ప్రముఖ సంస్థల యూనిట్లపై దాడులు జరిగే అవకాశం

ఈ పరిణామాల నేపథ్యంలోనే IRGC ఈ కఠిన హెచ్చరికలు జారీ చేసింది. అదనంగా, ఏప్రిల్ 1 నుంచి అమెరికాకు చెందిన పలు ప్రముఖ సంస్థల యూనిట్లపై దాడులు జరిగే అవకాశం ఉందని IRGC తెలిపింది. ఇందులో యాపిల్,మైక్రోసాఫ్ట్, ఇంటెల్, ఐబీఎం, డెల్, టెస్లా, బోయింగ్, హెచ్‌పీ, జేపీ మోర్గాన్ వంటి దిగ్గజ కంపెనీలు ఉన్నాయి. ఈ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు తమ భద్రత కోసం వెంటనే ఆ ప్రాంతాలను విడిచిపోవాలని సూచించింది. స్థానిక ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని హెచ్చరించింది. ఇప్పటికే ఇరాన్‌లో స్టార్‌లింక్ సేవల వినియోగంపై కఠిన నిషేధం అమల్లో ఉంది. ఆ నెట్‌వర్క్‌ను ఉపయోగించిన వారికి టెహ్రాన్ ప్రభుత్వం రెండు సంవత్సరాల జైలు శిక్ష విధిస్తోంది.

Advertisement