Balen Shah India Visit: మోదీ, ముర్ముకు అరుదైన కానుకలు.. భారత్‌కు నేపాల్ ప్రధాని బాలెన్ షా!
ఈ వార్తాకథనం ఏంటి
నేపాల్ ప్రధాని బాలెన్ షా ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా భారత్‌లో పర్యటించనున్నారు. నవంబర్ 22, 23 తేదీల్లో ఆయన భారత పర్యటన ఖరారైంది. ఆదివారం ఢిల్లీకి చేరుకోనున్న బాలెన్ షా.. సోమవారం ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతో వేర్వేరుగా సమావేశం కానున్నారు. ఈ పర్యటన సందర్భంగా వారిద్దరికీ అరుదైన కానుకలు అందించనున్నారు. భారత్-నేపాల్ మధ్య శతాబ్దాలుగా కొనసాగుతున్న చారిత్రక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక సంబంధాలను ప్రతిబింబించే రెండు ప్రత్యేక విగ్రహాలను బహుమతిగా తీసుకొస్తున్నారు.
వివరాలు
సంప్రదాయానికి భిన్నంగా బాలెన్ షా కానుకలు
గతంలో నేపాల్ ప్రధానులు భారత్‌లో పర్యటించినప్పుడు సంప్రదాయబద్ధంగా పశుపతినాథ్ ఆలయ నమూనాలను బహుమతిగా అందించేవారు.
అయితే బాలెన్ షా ఈసారి అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు.
ఇరు దేశాల మధ్య ఉన్న చారిత్రక అనుబంధాన్ని చాటిచెప్పేలా రెండు విశిష్టమైన విగ్రహాలను ఎంపిక చేశారు.
వివరాలు
మోదీకి 'రాతో మచ్చింద్రనాథ్' విగ్రహం
ప్రధాని నరేంద్ర మోదీకి బాలెన్ షా 'రాతో మచ్చింద్రనాథ్' విగ్రహాన్ని బహుమతిగా ఇవ్వనున్నారు.
ఖాట్మాండు లోయ ప్రాంత ప్రజలు అత్యంత భక్తిశ్రద్ధలతో కొలిచే ఈ దైవానికి భారత్‌తో విడదీయలేని సంబంధం ఉంది.
నేపాల్ చరిత్ర, విశ్వాసాల ప్రకారం.. పూర్వం ఖాట్మాండు లోయ తీవ్ర కరువుతో అల్లాడుతున్న సమయంలో లిచ్చవి వంశానికి చెందిన రాజు నరేంద్ర దేవ్.. ప్రస్తుత అస్సాం ప్రాంతం నుంచి రాతో మచ్చింద్రనాథ్‌ను ఖాట్మాండుకు తీసుకొచ్చారు.
ఆ తర్వాత లోయలో సమృద్ధిగా వర్షాలు కురిసి, ప్రజల కష్టాలు తీరాయని నమ్ముతారు.
వివరాలు
రాష్ట్రపతికి 'చారుమతి విహార్' విగ్రహం
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు ఖాట్మాండులోని చబహిల్ ప్రాంతంలో ఉన్న చారుమతి విహార్‌కు సంబంధించిన విగ్రహాన్ని నేపాల్ ప్రధాని అందించనున్నారు.
ఈ బౌద్ధ విహారానికి మౌర్య చక్రవర్తి అశోకుడు, ఆయన కుమార్తె చారుమతితో చారిత్రక సంబంధం ఉంది. చారిత్రక కథనాల ప్రకారం.. అశోకుడు తన కుమార్తె చారుమతితో కలిసి ఖాట్మాండు లోయను సందర్శించారు.
ఆ సమయంలో చారుమతి స్థానిక నేపాల్ యువరాజు దేవపాల్‌ను వివాహం చేసుకుని దేపపటాన్‌లో స్థిరపడింది. అక్కడే ఆమె ఈ విహారాన్ని నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది.
వివరాలు
భారత్-నేపాల్ సంబంధాల బలోపేతమే లక్ష్యం
భారత్‌తో సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న సంబంధాల నేపథ్యంలో నేపాల్ ప్రధానులు అధికారం చేపట్టిన తర్వాత భారత పర్యటనకు రావడం ఆనవాయితీగా మారింది.
భారత్ కూడా తన 'నైబర్‌హుడ్ ఫస్ట్' విధానంలో భాగంగా పొరుగు దేశాలతో సంబంధాలకు ప్రాధాన్యత ఇస్తోంది.
ఈ నేపథ్యంలో బాలెన్ షా పర్యటనతో ఇరు దేశాల మధ్య దౌత్య, సాంస్కృతిక సంబంధాలు మరింత బలోపేతమవుతాయని భావిస్తున్నారు.
వివరాలు
సరిహద్దు వివాదాలపైనా చర్చించే అవకాశం
భూపరివేష్టిత దేశమైన నేపాల్.. వాణిజ్యం, రవాణా అవసరాల కోసం భారత్‌పై ఆధారపడుతోంది. అయితే లిపులేఖ్, లింపియాధుర, కాలాపానీ సరిహద్దు వివాదాలు ఇరు దేశాల సంబంధాలపై ప్రభావం చూపుతున్నాయి.
ఈ ప్రాంతాలు తమ భూభాగాలేనని భారత్ వాదిస్తుండగా.. అవి తమవేనని నేపాల్ పేర్కొంటోంది. దీంతో రెండు దేశాల మధ్య కొంతకాలంగా ఉద్రిక్తత నెలకొంది.
బాలెన్ షా భారత పర్యటన నేపథ్యంలో ఈ సరిహద్దు వివాదాల అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
మొత్తంగా ఈ పర్యటన ఇరు దేశాల మధ్య సంబంధాల పరంగా ప్రాధాన్యత సంతరించుకుంది.