
Rare US snowstorm: అమెరికాలో అరుదైన మంచు తుఫాను..2,100 విమానాలు రద్దు, 10 మంది మృతి
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికాను మంచు తుఫాను వణికిస్తోంది. టెక్సాస్, లూసియానా, మిస్సిసిప్పి, అలబామా, జార్జియా, సౌత్ కరోలినా రాష్ట్రాలలో 10 ఇంచుల వరకూ మంచు పేరుకుపోయింది. ఈ అసాధారణ తుఫానుతో రోడ్లు మంచుతో కప్పబడ్డాయి. వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. విమానాల సేవలు రద్దు చేయబడ్డాయి. అమెరికా మొత్తం 2,100 విమానాలు రద్దు చేశారు. కనీసం 10 మంది మృతి చెందారు. అన్ని పాఠశాలలు మూసివేశారు. చరిత్రలో కనివినీ ఎరుగని విధంగా దక్షిణ అమెరికాను ఈ తుఫాను అతలాకుతలం చేసింది. 62 సంవత్సరాల తర్వాత ఇంత పెద్ద ఎత్తున మంచు తుఫాను సంభవించడం ఇదే తొలిసారి.
వివరాలు
మంచుతుఫాను పై లూసియానా గవర్నర్ ప్రజలకు హెచ్చరిక జారీ
చలి తీవ్రత కారణంగా టెక్సాస్,జార్జియా,మిల్వాకీలలో నలుగురు వ్యక్తులు మరణించారు. మంగళ, బుధవారాల్లో పోర్టులో ఎగుమతులు, దిగుమతులు ఆపివేశారు. లూసియానాలోని న్యూ ఓర్లీన్స్ చుట్టూ భారీ మంచు తుఫాను కురిసింది.ఈ ప్రాంతంలో 1963 తర్వాత అతిపెద్ద హిమపాతం అని అధికారులు పేర్కొంటున్నారు. లూయిస్ ఆర్మ్‌స్ట్రాంగ్ న్యూ ఓర్లీన్స్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి అనేక ఎయిర్ లైన్స్ తమ విమానాలను రద్దు చేశాయి. లూసియానాలో పాఠశాలలు,స్టేట్ ఆఫీసులు మూసివేశారు.హ్యూస్టన్ నుండి న్యూ ఓర్లీన్స్ వరకు, జార్జియా ప్రాంతంలో కూడా స్కూళ్లు మూతపడ్డాయి. మంచుతుఫాను పై లూసియానా గవర్నర్ ప్రజలకు హెచ్చరిక జారీ చేశారు. వచ్చే ఏడు రోజుల్లో చలి ప్రమాదకరంగా మారవచ్చని తెలిపారు.మంచు తీవ్రత మరింత పెరిగిపోతుందని,ఇండ్ల నుండి బయటికి రాకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.