LOADING...
Gaza: ఆగని ఇజ్రాయెల్ దాడులు.. గాజాలో 73 వేల మందికి పైగా మృతి
ఆగని ఇజ్రాయెల్ దాడులు.. గాజాలో 73 వేల మందికి పైగా మృతి

Gaza: ఆగని ఇజ్రాయెల్ దాడులు.. గాజాలో 73 వేల మందికి పైగా మృతి

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 15, 2026
12:13 pm

ఈ వార్తాకథనం ఏంటి

గతేడాది అక్టోబర్‌లో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉన్నప్పటికీ గాజాపై ఇజ్రాయెల్‌ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో 2023 అక్టోబర్‌లో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు గాజాలో మరణించిన వారి సంఖ్య 73 వేల మార్కును చేరుకుందని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం వెల్లడించింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్స్‌ (ఐడీఎఫ్‌) సైనికులు నిరంతరం దాడులు కొనసాగిస్తున్నారని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖలోని రికార్డుల విభాగం అధిపతి జహీర్‌ అల్‌ వహేదీ, ప్రజా సంబంధాల విభాగం సారథి హమ్జా సలీం ఆరోపించారు.

వివరాలు

ఇప్పటివరకూ 1,73,200 మంది మృతి

ఆదివారం ఒక్కరోజే ఖాన్‌ యూనిస్‌లో ఇద్దరు, సెంట్రల్‌ గాజాలో ఒకరు మృతి చెందగా, గతంలో గాయపడిన మరో ఇద్దరు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు గాజాలో 1,73,200 మందికిపైగా గాయపడినట్లు వెల్లడించారు. 2023 అక్టోబర్‌ 7న హమాస్‌ సాయుధులు ఇజ్రాయెల్‌ సరిహద్దు గ్రామాలపై మెరుపుదాడులు నిర్వహించి స్థానికులు, పర్యాటకులు, విదేశీయులు సహా సుమారు 1,200 మందిని హతమార్చారు. అలాగే 251 మందిని బందీలుగా తీసుకుని గాజాలోని భూగర్భ సొరంగాల్లో నిర్బంధించిన విషయం తెలిసిందే.

వివరాలు

ప్రాణాలు కోల్పోయిన వారిలో సగానికి పైగా మహిళలే

ఈ దాడులకు ప్రతీకారంగా ఇజ్రాయెల్‌ గాజాపై భారీ సైనిక చర్యలు ప్రారంభించింది. అప్పటి నుంచి కొనసాగుతున్న దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారిలో సగానికి పైగా మహిళలు, చిన్నారులేనని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇక కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చిన తర్వాత చోటుచేసుకున్న పరస్పర కాల్పుల ఘటనల్లో కేవలం ఐదుగురు ఇజ్రాయెల్‌ సైనికులు మాత్రమే మరణించినట్లు గాజా అధికారులు వెల్లడించారు. గాజాలో మానవతా సంక్షోభం రోజురోజుకూ మరింత తీవ్రమవుతుండగా, అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేస్తోంది.

Advertisement