Papua New Guinea: బంగారు గనిపై హక్కుల వివాదం.. సాయుధ ఘర్షణల్లో 30 మంది మృతి
పపువా న్యూ గినియాలో బంగారు గనిపై చోటు చేసుకున్న హక్కుల వివాదం తీవ్ర ఘర్షణలకు దారితీసింది. ఈ ఘటనలో 30 మంది ప్రాణాలు విడిచారు. ఈ విషయాన్ని స్థానిక పోలీసులు సోమవారం ధ్రువీకరించారు. మృతుల సంఖ్య 50కి చేరే అవకాశం ఉందని స్థానిక మీడియా వెల్లడించింది. ఈ ఘర్షణలు పపువా న్యూగినియా మధ్య ప్రాంతంలోని పోర్‌గెరా బంగారుగని వద్ద చోటు చేసుకున్నాయి. అగస్టు నెల నుంచి సకార్ తెగవారు ఈ బంగారుగని భూమిని అక్రమంగా ఆక్రమించుకోవడంతో, వాస్తవ హక్కులు కలిగిన పయాండె తెగవారు ఘర్షణలో పడ్డారు.
భద్రతా దళాలకు అదనపు అధికారులు
ఆదివారం జరిగిన ఈ ఘర్షణలో సుమారు 300 రౌండ్ల కాల్పులు జరిగాయి. ఇరు వర్గాల మధ్య శాంతి చర్చలు విఫలమవడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. భారీ హింసాత్మక ఘటనల నేపథ్యంలో పపువా న్యూగినియా ప్రభుత్వం భద్రతా దళాలకు అదనపు అధికారాలు కట్టబెట్టింది. అల్లర్లను అరికట్టేందుకు ఆల్కహాల్ విక్రయాలను నిలిపివేసి, రాత్రిపూట కర్ఫ్యూ విధించింది. ఈ ప్రాంతంలో గతంలోనూ అల్లర్లు చోటుచేసుకున్నాయి. ఈ సారి ఆటోమేటిక్ ఆయుధాలు వాడటం వల్ల పరిస్థితి మరింత దిగజారింది. ఈ ఏడాది మొదట్లో జరిగిన హింసలో 26 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.