Kharg Island: పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు.. ఇరాన్ కీలక ద్వీపంపై అమెరికా దాడి
ఈ వార్తాకథనం ఏంటి
పశ్చిమాసియాలో యుద్ధ ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయి. ఇప్పటివరకు ఇరాన్ అణు కేంద్రాలు, సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకున్న అమెరికా.. ఇప్పుడు ఆ దేశ ఆర్థిక వ్యవస్థపై కూడా ఒత్తిడి పెంచే చర్యలకు దిగింది. ఇరాన్ చమురు ఎగుమతులకు వ్యూహాత్మక కేంద్రంగా ఉన్న ఖర్గ్ ఐలాండ్‌పై అమెరికా బలగాలు దాడి చేసినట్లు వెల్లడైంది. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్ ద్వారా ప్రకటించారు. తన ఆదేశాల మేరకు యూఎస్ సెంట్రల్ కమాండ్ ఈ ఆపరేషన్‌ను నిర్వహించిందని ట్రంప్ తెలిపారు. ఖర్గ్ ఐలాండ్‌లో ఉన్న సైనిక కేంద్రాలను పూర్తిగా ధ్వంసం చేసినట్లు పేర్కొన్నారు. పశ్చిమాసియా చరిత్రలో జరిగిన అత్యంత శక్తివంతమైన దాడుల్లో ఇదొకటిగా ఆయన అభివర్ణించారు.
Details
అమెరికా ఆయుధ వ్యవస్థలు అత్యంత శక్తివంతమైనవి
అయితే ఆ ద్వీపంలోని చమురు మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకోలేదని ట్రంప్ స్పష్టం చేశారు. కానీ హార్ముజ్ జలసంధి వద్ద నౌకల రవాణాను ఇరాన్ లేదా ఇతరులు అడ్డుకుంటే.. వెంటనే చమురు మౌలిక సదుపాయాలపై దాడి చేసే విషయాన్ని మళ్లీ పరిశీలిస్తామని హెచ్చరించారు. అమెరికా ఆయుధ వ్యవస్థలు అత్యంత శక్తివంతమైనవని, తాము లక్ష్యంగా చేసుకునే వాటిని రక్షించుకునే సామర్థ్యం ఇరాన్‌కు లేదని ట్రంప్ వ్యాఖ్యానించారు. అలాగే ఇరాన్ అణ్వాయుధాలు కలిగి ఉండకూడదనే తన అభిప్రాయాన్ని మరోసారి స్పష్టం చేశారు. ఇరాన్ సైన్యంతో పాటు వారితో సంబంధాలు ఉన్నవారు వెంటనే ఆయుధాలు వదిలేయాలని ట్రంప్ పిలుపునిచ్చారు. ఇంకా మిగిలి ఉన్న ప్రాంతాలను రక్షించుకోవడం ఇరాన్‌కు తెలివైన నిర్ణయమని సూచించారు.