Northkorea: చెత్తతో నిండిన బెలూన్లను ఎగరేసిన ఉత్తర కొరియా .. దక్షిణ కొరియా విమానాశ్రయ కార్యకలాపాలకు అంతరాయం
ఉత్తర కొరియా చెత్తతో నిండిన బెలూన్‌లను ప్రయోగించడంతో దక్షిణ కొరియాలోని ఇంచియాన్ విమానాశ్రయం మూసివేశారు. ఇది విమానాశ్రయం నుండి టేకాఫ్, ల్యాండింగ్‌పై ప్రభావం చూపిందని ఇంచియాన్ విమానాశ్రయ ప్రతినిధి తెలిపారు. ఉత్తర కొరియా బెలూన్ ఒకటి ప్యాసింజర్ టెర్మినల్ సమీపంలో పడిపోయింది. రెండో, మూడో బెలూన్లు కూడా రన్‌వే దగ్గర పడిపోయాయి. దీంతో విమానాశ్రయం కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేశారు. విమానాశ్రయం సరిహద్దులో పలు బెలూన్లు కనిపించాయని అధికార ప్రతినిధి తెలిపారు. ఉత్తర కొరియాకు కేవలం 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇంచియాన్ విమానాశ్రయాన్ని మూసివేయడం ఇదే మొదటిసారి కాదు. అంతకుముందు ఉత్తర కొరియా పంపిన బెలూన్ల కారణంగా విమానాశ్రయాన్ని మూసివేయాల్సి వచ్చింది.
ల్యాండ్ కావాల్సిన ఎనిమిది విమానాలు దారి మళ్లింపు
బుధవారం తెల్లవారుజామున 1.46 గంటల నుంచి 4.44 గంటల వరకు విమానాశ్రయం కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఆ తర్వాత రన్‌వేలు తెరిచి ఎయిర్‌పోర్టు కార్యకలాపాలు యథావిధిగా సాగుతున్నాయని అధికారులు తెలిపారు. తెల్లవారుజామునే విమానాలు తక్కువగా ఉండడంతో పెద్దగా ఇబ్బంది లేదని తెలిపారు. కార్గో విమానాలతో సహా ఇంచియాన్‌లో ల్యాండ్ కావాల్సిన ఎనిమిది విమానాలు దారి మళ్లించారు. అనంతరం, విమానాశ్రయం తిరిగి ప్రారంభమయ్యింది. అయితే విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి.