Loading...
Kim Jong Un Death Rumors: కిమ్ జోంగ్ ఉన్ మరణించారంటూ ప్రచారం.. ఫొటోలతో స్పందించిన ఉత్తర కొరియా
కిమ్ జోంగ్ ఉన్ మరణించారంటూ ప్రచారం.. ఫొటోలతో స్పందించిన ఉత్తర కొరియా

Kim Jong Un Death Rumors: కిమ్ జోంగ్ ఉన్ మరణించారంటూ ప్రచారం.. ఫొటోలతో స్పందించిన ఉత్తర కొరియా

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 20, 2026
12:40 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ మరణించారంటూ ప్రచారం జరుగుతున్న వేళ.. ఆయనకు సంబంధించిన కొత్త ఫొటోలను ఆ దేశం విడుదల చేసింది. చిన్నారుల షూస్‌, మహిళల దుస్తులను పరిశీలిస్తున్నట్లుగా ఈ చిత్రాలు ఉన్నాయి. ఇటీవల కిమ్‌కు తీవ్ర వైద్య సమస్య తలెత్తిందని, చికిత్స పొందుతూ ఆయన మరణించారని కొన్ని ఆన్‌లైన్ పోస్టుల్లో ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో తాజాగా విడుదలైన ఫొటోలు ఆసక్తికరంగా మారాయి. ఉత్తర కొరియా అధికారిక వార్తా సంస్థ కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ (KCNA) వెల్లడించిన వివరాల ప్రకారం.. కిమ్ జోంగ్ ఉన్ సోమవారం దుస్తులు, పాదరక్షల ప్రదర్శనను సందర్శించారు.

వివరాలు

చైనా అసమ్మతివాది పోస్టులతో కిమ్ మరణంపై పుకార్లు

అక్కడ ప్రదర్శనలో ఉంచిన వివిధ ఉత్పత్తులను పరిశీలించడంతోపాటు అధికారులతో మాట్లాడారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను KCNA విడుదల చేసింది.

అయితే ఈ చిత్రాల ప్రామాణికతను స్వతంత్రంగా నిర్ధారించలేదు. అవి ఖచ్చితంగా ఏ తేదీన తీసినవన్నది కూడా స్పష్టంగా తెలియరాలేదు.

అమెరికాలో నివసిస్తున్న చైనా అసమ్మతివాది, చైనా డెమోక్రసీ పార్టీతో సంబంధాలున్న వాంజున్ జీ (Wanjun Xie) ఆదివారం సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో చేసిన పోస్టులతో కిమ్ జోంగ్ ఉన్ మరణంపై ప్రచారం మొదలైంది.

కిమ్ మరణించారని, ఆయన తర్వాత నాయకత్వ మార్పు సంక్షోభం తలెత్తే అవకాశం ఉందన్న ఆందోళనతో చైనా 9,000 మంది సైనికులను ఉత్తర కొరియా రాజధాని ప్యాంగ్యాంగ్‌కు పంపిందని ఆయన తొలుత పేర్కొన్నారు.

వివరాలు

మరణంపై సోషల్ మీడియాలో ప్రచారం

ఆ తర్వాత కిమ్‌కు తీవ్రస్థాయిలో మెదడులో రక్తస్రావం జరిగిందని వాంజున్ జీ ఆరోపించారు.

ఆయనకు చికిత్స అందించేందుకు బీజింగ్‌లోని పెకింగ్ యూనియన్ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి చెందిన వైద్య నిపుణులు శనివారం ఉత్తర కొరియాకు వెళ్లారని వెల్లడించారు.

కిమ్ కోమాలోకి వెళ్లడంతో అత్యవసర చికిత్స కోసం బీజింగ్‌కు తరలించారని, అక్కడ వైద్యం అందించినప్పటికీ ఆయన మరణించారని పేర్కొన్నారు. అనంతరం కిమ్ మృతదేహాన్ని రహస్యంగా ఉత్తర కొరియాకు తీసుకొచ్చినట్లు కూడా ఆరోపించారు.

అయితే, ఈ వాదనలకు మద్దతుగా వాంజున్ జీ ఎలాంటి వైద్య రికార్డులను వెల్లడించలేదు. గుర్తించగలిగే సాక్షులను లేదా స్వతంత్రంగా నిర్ధారించగల ఆధారాలను కూడా ఆయన అందించలేదు.

కిమ్ మరణించారన్న ప్రచారం మీడియాలో వ్యాపించింది. అంతర్జాతీయ మీడియా సంస్థల్లోనూ దీనిపై కథనాలు వెలువడ్డాయి.

ADVERTISEMENT

వివరాలు

కిమ్ సోదరి కిమ్ యో జోంగ్ బాధ్యతలు చేపట్టారా?

కిమ్ జోంగ్ ఉన్ మరణించారన్న ప్రచారం నేపథ్యంలో ఆయన సోదరి కిమ్ యో జోంగ్ దేశ పాలనా బాధ్యతలను చేపట్టారా? అనే చర్చ కూడా మొదలైంది.

ఒకవేళ కిమ్‌కు ఏదైనా జరిగితే ఉత్తర కొరియా నాయకత్వంలో ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటాయన్న అంశంపై ఆసక్తి నెలకొంది.

అయితే కిమ్ మరణించారంటూ వస్తున్న వార్తలపై ఉత్తర కొరియా అధికారులు ఇప్పటివరకు బహిరంగంగా స్పందించలేదు.

తాజాగా విడుదలైన ఫొటోలు కిమ్ కార్యకలాపాలకు సంబంధించిన సమాచారాన్ని అందిస్తున్నప్పటికీ, వాటి ప్రామాణికత, అవి తీసిన తేదీపై స్పష్టత లేదు.

కాబట్టి ఈ చిత్రాలను మాత్రమే ఆధారంగా చేసుకుని ఆయన మరణంపై వస్తున్న పుకార్లకు పూర్తిగా ముగింపు పలకలేని పరిస్థితి ఉంది.

ADVERTISEMENT

వివరాలు

 గుండె సంబంధిత సమస్యల ప్రమాదం ఉందన్న దక్షిణ కొరియా

కిమ్ జోంగ్ ఉన్ ఆరోగ్య పరిస్థితిపై అంతర్జాతీయంగా చాలాకాలంగా ఆసక్తి నెలకొంది.

ఉత్తర కొరియా నాయకత్వానికి సంబంధించిన సమాచారం అత్యంత రహస్యంగా ఉండటంతోపాటు, అక్కడ ఆకస్మికంగా నాయకత్వ మార్పు చోటుచేసుకుంటే ప్రాంతీయ రాజకీయాలపై ప్రభావం పడే అవకాశం ఉంది.

ఈ కారణాలతో కిమ్ ఆరోగ్యానికి సంబంధించిన ప్రతి వార్త ప్రాధాన్యం సంతరించుకుంటోంది.

దక్షిణ కొరియా జాతీయ నిఘా సంస్థ సెప్టెంబర్ చివర్లో చట్టసభ సభ్యులకు వెల్లడించిన వివరాల ప్రకారం.. కిమ్ జోంగ్ ఉన్ బరువు సుమారు 140 కిలోలు (309 పౌండ్లు) ఉండవచ్చని అంచనా వేసింది.

ఈ నేపథ్యంలో ఆయనకు గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉండవచ్చని పేర్కొంది.

వివరాలు

2011 నుంచి ఉత్తర కొరియా పగ్గాలు కిమ్ చేతుల్లోనే..

అయితే, కిమ్‌కు తీవ్రమైన ఆరోగ్య సమస్య ఉన్నట్లు స్పష్టమైన సంకేతాలు లేవని కూడా ఆ సంస్థ తెలిపింది.

ఉత్తర కొరియా నౌకాదళానికి చెందిన డిస్ట్రాయర్‌ను పరిశీలించే సమయంలో కిమ్ మెట్లు వేగంగా ఎక్కగలిగారని ప్రస్తావించింది.

ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్య బృందం నిశితంగా పర్యవేక్షిస్తున్నట్లు భావిస్తున్నామని వెల్లడించింది.

కిమ్ జోంగ్ ఉన్ తన తండ్రి కిమ్ జోంగ్ ఇల్ మరణం తర్వాత 2011 డిసెంబర్‌లో ఉత్తర కొరియా అధికార పగ్గాలను చేపట్టారు. అప్పటి నుంచి దేశ నాయకత్వ బాధ్యతలను నిర్వహిస్తున్నారు.

ఉత్తర కొరియా వ్యవస్థాపకుడు, తన తాత కిమ్ ఇల్ సంగ్ ప్రారంభించిన కుటుంబ పాలనను ఆయన కొనసాగిస్తున్నారు.

కిమ్ పాలనలో ఉత్తర కొరియా అణ్వాయుధాలు, బాలిస్టిక్ క్షిపణుల అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తోంది.

ADVERTISEMENT