Russia: భారత్‌కు ఇంధన సరఫరాలు ఆగవు.. అన్ని ఒప్పందాలు అమలు చేస్తాం: లావ్రోవ్
ఈ వార్తాకథనం ఏంటి
రష్యాతో భారత్‌కు ఉన్న సంబంధాలు మరింత బలపడతాయని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్(Sergey Lavrov)స్పష్టం చేశారు. ఇంధన సరఫరాలకు సంబంధించిన అన్ని ఒప్పందాలను పూర్తిగా అమలు చేస్తామని ఆయన తెలిపారు. త్వరలో భారత పర్యటనకు రానున్న నేపథ్యంలో ఓ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్-రష్యా సంబంధాలు పరస్పర స్నేహం, నమ్మకంపై కొనసాగుతున్నాయని, అవి బలహీనపడే పరిస్థితి లేదని పేర్కొన్నారు. ప్రపంచం చూసిన ప్రభావశీల నాయకుల్లో ప్రధాని నరేంద్ర మోదీ ఒకరని లావ్రోవ్ ప్రశంసించారు. ఆర్థిక రంగం, రక్షణ వ్యవస్థ, సంస్కృతి తదితర అన్ని రంగాల్లో భారత్ స్వావలంబన సాధించే దిశగా మోదీ కృషి చేస్తున్నారని చెప్పారు.
వివరాలు
తమిళనాడు అణు విద్యుత్ కేంద్రంలో కొత్త విద్యుత్ యూనిట్ల నిర్మాణానికి రష్యా సహకారం
ఇంధన సరఫరాల విషయంలో రష్యా ఎప్పుడూ తన బాధ్యతలను విస్మరించలేదని లావ్రోవ్ తెలిపారు. భారత్‌కు చమురు సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగనివ్వబోమని స్పష్టం చేశారు. అన్యాయమైన, నిజాయతీ లేని పోటీ మార్కెట్.. ఇరుదేశాల మధ్య కుదిరిన ఒప్పందాలపై ప్రభావం చూపకుండా జాగ్రత్తలు తీసుకుంటామని పేర్కొన్నారు. తమిళనాడులోని కుడంకుళం అణు విద్యుత్ కేంద్రంలో కొత్త విద్యుత్ యూనిట్ల నిర్మాణానికి రష్యా సహకారం కొనసాగుతోందని తెలిపారు. భారత్ అవసరాలకు అనుగుణంగా గ్యాస్, చమురు, బొగ్గు సరఫరాలు నిరంతరం కొనసాగుతాయని చెప్పారు. భారత్-రష్యా సంబంధాలను దెబ్బతీయడానికి కొందరు ప్రయత్నిస్తున్నారని, అలాంటి చర్యలపై అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు.
వివరాలు
జై శంకర్'తో లావ్రోవ్ సమావేశం
'హిందీ-రూసీ భాయ్ భాయ్' అనే నినాదం కేవలం మాట మాత్రమే కాదని, అది ఇరుదేశాల సాంస్కృతిక అనుబంధానికి ప్రతీక అని లావ్రోవ్ పేర్కొన్నారు. భారతీయ సినిమాలు, ముఖ్యంగా రాజ్ కపూర్ చిత్రాలు, టెలివిజన్ కార్యక్రమాలు రష్యాలో ఇప్పటికీ విశేష ఆదరణ పొందుతున్నాయని చెప్పారు. ఆర్థికం, రక్షణ, ఇంధన రంగాలతో పాటు సాంస్కృతిక, మానవతా సంబంధాల్లో కూడా భారత్-రష్యా బంధం బలంగా కొనసాగుతోందన్నారు. భారత పర్యటనలో భాగంగా విదేశాంగశాఖ మంత్రి జై శంకర్'తో లావ్రోవ్ సమావేశం కానున్నారు. అలాగే BRICS విదేశాంగ మంత్రుల సమావేశంలో కూడా ఆయన పాల్గొననున్నారు.