Ukraine-Russia: ఉక్రెయిన్‌పై 188 డ్రోన్లతో రష్యా దాడి.. 17 ప్రాంతాలు ధ్వంసం
రష్యా మరోసారి ఉక్రెయిన్‌పై డ్రోన్ దాడులు చేపట్టింది. మొత్తం 188 డ్రోన్లతో 17 ప్రాంతాల్లో దాడులు చేసినట్లు ఉక్రెయిన్ వైమానిక దళం ప్రకటించింది. గత దాడుల కంటే ఈ సారి రికార్డు స్థాయిలో డ్రోన్లు ప్రయోగించినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే వాటిలో చాలా డ్రోన్లను అడ్డుకున్నట్లు వెల్లడించారు. ఈ దాడులు మౌలిక సదుపాయాలు, భవనాలు, జాతీయ పవర్‌గ్రిడ్‌కు తీవ్ర నష్టం చేకూర్చాయి. కానీ సౌకర్యాలు దెబ్బతిన్నా, ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని పేర్కొన్నాయి. రష్యా సరిహద్దులో ఉక్రెయిన్ ఉంచిన 39 డ్రోన్లను రష్యా సైన్యం ధ్వంసం చేసినట్లు సమాచారం.
అణ్వాయుధాలను ఉపయోగించే అవకాశం
ఇదే సమయంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ రష్యా గ్లైడ్ బాంబులు ప్రయోగించినట్టు వెల్లడించారు. 800 కేఏబీ శ్రేణిలోని భారీ 1500 కేజీ బాంబులతో రష్యా దాడి చేసినట్లు ఆయన తెలిపారు. ఉక్రెయిన్‌పై రష్యా ఆక్రమణ ప్రారంభించిన రోజే, రష్యా అణ్వాయుధాలను యుద్ధంలో ఉపయోగించడానికి సిద్ధంగా ఉన్నట్లు రష్యా సైనికుడు తెలిపారు. ఈ ఘటనలు వల్ల పుతిన్ అణ్వాయుధాలను ఉపయోగించే అవకాశం ఉందన్న ఆందోళనలు పెంచాయి.