Ukraine: రష్యాపై ఉక్రెయిన్ భారీ డ్రోన్ దాడి.. ఒక్క రాత్రిలోనే 660 డ్రోన్ల ప్రయోగం
ఈ వార్తాకథనం ఏంటి
ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం మరింత ఉద్ధృతంగా మారుతోంది. తాజాగా మాస్కో నియంత్రణలో ఉన్న క్రిమియాతో పాటు రష్యాలోని 12 ప్రాంతాలపై ఉక్రెయిన్ భారీ డ్రోన్ దాడులకు పాల్పడింది. ఒక్క రాత్రిలోనే 660 డ్రోన్లను ప్రయోగించినట్లు రష్యా వెల్లడించింది. అయితే వాటన్నింటినీ విజయవంతంగా అడ్డుకున్నామని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ శుక్రవారం ప్రకటించింది. రాజధాని మాస్కోతో పాటు అజోవ్, నల్ల సముద్ర తీర ప్రాంత నగరాలు, క్రిమియా ఈ దాడుల లక్ష్యంగా మారాయి. మాస్కో వైపు దూసుకొచ్చిన 47 డ్రోన్లను కూల్చివేసినట్లు నగర మేయర్ తెలిపారు. అయితే ఈ దాడుల వల్ల ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం జరిగిందా అనే విషయంపై ఆయన ఎలాంటి వివరాలు వెల్లడించలేదు.
వివరాలు
రష్యా సైనిక స్థావరాలు, విద్యుత్ మౌలిక సదుపాయాలే ప్రధాన లక్ష్యం
నోవోమోస్కోవ్‌స్కీ ప్రాంతంలోని ఓ రసాయన కర్మాగారం, జలవిద్యుత్ కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుని ఉక్రెయిన్ డ్రోన్లు దాడి చేసినట్లు సమాచారం. ఈ ఘటనలో అక్కడ భారీగా మంటలు చెలరేగినట్లు వార్తలు వెలువడుతున్నాయి. అయితే దీనిపై రష్యా ప్రభుత్వం అధికారికంగా స్పందించలేదు. ఈ దాడుల కారణంగా కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయినట్లు సమాచారం. యుద్ధానికి ముగింపు పలికేందుకు అమెరికా ఏడాది కాలంగా చేస్తున్న శాంతి ప్రయత్నాలు ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో రష్యా సైనిక స్థావరాలు, విద్యుత్ మౌలిక సదుపాయాలనే ప్రధాన లక్ష్యంగా చేసుకుని ఉక్రెయిన్ ఇటీవల తన దాడులను మరింత ఉద్ధృతం చేసింది.
వివరాలు
40 రోజుల పాటు ప్రత్యేక ఆపరేషన్
ఈ పరిణామాలపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఎక్స్ వేదికగా స్పందించారు. యుద్ధాన్ని ముగించేలా రష్యాపై ఒత్తిడి తీసుకురావడానికి 40 రోజుల పాటు ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ కాలంలో తమ సైనిక చర్యలు అత్యంత తీవ్రంగా కొనసాగుతాయని తెలిపారు. ఆయన ప్రకటన వెలువడిన కొద్ది గంటల్లోనే రష్యాపై భారీ డ్రోన్ దాడులు జరగడం గమనార్హం. మరోవైపు రష్యా కూడా క్షిపణి దాడులను మరింత వేగవంతం చేసింది.
వివరాలు
ఖర్కీవ్‌పై జరిగిన రష్యా దాడుల్లో ఇద్దరు మృతి
గత 24 గంటల్లో ఖర్కీవ్‌పై జరిగిన రష్యా దాడుల్లో ఇద్దరు మరణించినట్లు ఉక్రెయిన్ వెల్లడించింది. అలాగే గత రాత్రి రష్యా ప్రయోగించిన 189 డ్రోన్లను తమ వైమానిక దళం అడ్డుకున్నట్లు తెలిపింది. ఇదిలా ఉండగా, ఉక్రెయిన్‌పై సైనిక చర్యల నేపథ్యంలో రష్యాపై అమలు చేస్తున్న ఆర్థిక ఆంక్షలను మరో ఏడాది పాటు పొడిగిస్తున్నట్లు ఐరోపా సమాఖ్య ప్రకటించింది. ఈ ఆంక్షలు 2027 జులై 31 వరకు అమల్లో కొనసాగనున్నట్లు అధికారిక ప్రకటనలో వెల్లడించింది.