LOADING...
Russia: రష్యాపై ఉక్రెయిన్ డ్రోన్ దాడి..మాస్కో విమానాశ్రయాలలో విమాన సర్వీసులు నిలిపివేత 
రష్యాపై ఉక్రెయిన్ డ్రోన్ దాడి..మాస్కో విమానాశ్రయాలలో విమాన సర్వీసులు నిలిపివేత

Russia: రష్యాపై ఉక్రెయిన్ డ్రోన్ దాడి..మాస్కో విమానాశ్రయాలలో విమాన సర్వీసులు నిలిపివేత 

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 10, 2025
09:21 am

ఈ వార్తాకథనం ఏంటి

రష్యా-ఉక్రెయిన్‌ మధ్య డ్రోన్‌ దాడులు నిరంతరం కొనసాగుతున్నాయి. ఊహించని విధంగా దెబ్బకొట్టిన ఉక్రెయిన్‌పై రష్యా 479 డ్రోన్లను వినియోగించి భారీ దాడులకు పాల్పడింది. దీంతో కీవ్‌ కూడా తక్షణమే ప్రతిస్పందనగా మాస్కోపై ప్రత్యుత్తర దాడులకు దిగింది. ఈ పరిణామాల నేపథ్యంలో మాస్కోలో విమాన సర్వీసులు పూర్తిగా నిలిచిపోయాయి. మాస్కోకు సేవలందించే ప్రధానమైన నాలుగు విమానాశ్రయాల్లో విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేయనున్నట్టు రష్యా పౌర విమానయాన సంస్థ 'రోసావియాట్సియా' ప్రకటించింది. ఉక్రెయిన్‌ డ్రోన్‌ దాడులు జరుపుతోందన్న సమాచారాన్ని రక్షణ శాఖ వెల్లడించిన నేపథ్యంలో, ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని భద్రతాపరమైన చర్యలలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.

వివరాలు 

76 ఉక్రెయిన్‌ డ్రోన్లను కూల్చివేసిన రష్యా 

అదేవిధంగా సోమవారం అర్ధరాత్రి నుంచి కేవలం రెండు గంటల వ్యవధిలో రష్యా గగనతలంలో 76 ఉక్రెయిన్‌ డ్రోన్లను కూల్చివేసినట్లు క్రెమ్లిన్‌ అధికారికంగా తెలిపింది. రష్యా వాయుసేన స్థావరాలపై ఉక్రెయిన్‌ ఊహించని రీతిలో విరుచుకుపడిన నేపథ్యంలో,రష్యా తన ప్రతీకార చర్యలను మరింత తీవ్రంగా కొనసాగించింది. ఇప్పటివరకు ఈ యుద్ధంలో ఎన్నడూ చూడని విధంగా 479 డ్రోన్లతో ఉక్రెయిన్‌పై దాడి చేసింది. ముఖ్యంగా ఉక్రెయిన్‌కు చెందిన మధ్య,పశ్చిమ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని రష్యా పెద్ద ఎత్తున డ్రోన్‌ దాడులతో పాటు 20 క్షిపణి దాడులను నిర్వహించినట్లు ఉక్రెయిన్‌ ఎయిర్‌ఫోర్స్‌ వెల్లడించింది. ఈ దాడుల్లో తమ గగనతల రక్షణ వ్యవస్థ ద్వారా మొత్తం 277 డ్రోన్లను, 19 క్షిపణులను విజయవంతంగా అడ్డుకున్నట్లు కూడా ఉక్రెయిన్‌ ఎయిర్‌ఫోర్స్‌ స్పష్టంచేసింది.