Alexei Navalny: రష్యాలో ఎన్నికల వేళ.. పుతిన్ ప్రత్యర్థి జైలులో అదృశ్యం
రష్యాలో ప్రతిపక్ష నేత, ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రత్యర్థి అలెక్సీ నవానీ జైలులో హఠాత్తుగా అదృశ్యం కావడంతో కలకలం రేగుతోంది. రష్యాలో త్వరలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పుతిన్‌ను తీవ్రస్థాయిలో విమర్శించే అలెక్సీ నవానీ అదృశ్యం కావడం సంచలనంగా మారింది. దీంతో అలెక్సీ అదృశ్యం వెనుక పుతిన్ హస్తం ఉందని అతని మద్దతుదారులు ఆరోపిస్తున్నారు. రష్యాలో అలెక్సీ నవానీని పుతిన్ బద్ధ శత్రువు అని చెబుతుంటారు. ఆ దేశంలో పుతిన్ విధానాలను అలెక్సీ తీవ్రస్థాయిలో విమర్శిస్తారు. గత వారం రోజులుగా అలెక్సీ లాయర్లు అతన్ని సంప్రదించేందుకు ప్రయత్నించగా.. ఆయన జైలులో లేకపోవడం గమనార్హం.
అలెక్సీకి 19 సంవత్సరాల జైలు శిక్ష
అవినీతి వ్యతిరేక ఫౌండేషన్ అలెక్సీ ఏర్పాటు చేయగా.. దాన్ని తీవ్రవాద సంఘంగా పేర్కొంటూ పుతిన్ ప్రభుత్వం అతన్ని అరెస్టు చేసింది. ఈ కేసులో అలెక్సీకి ఆగస్టు 2023లో 19సంవత్సరాల జైలు శిక్ష పడింది. ప్రస్తుతం అలెక్సీ జైలు శిక్ష అనుభవిస్తున్నారు. అలెక్సీ ప్రతినిధి కిరా యార్మిష్ మాట్లాడుతూ.. అలెక్సీ నవానీ లాయర్లు అతన్ని జైలులో కలవలేకపోయారని, ఇప్పుడు అతను జైలులో లేడని తమకు సమాచారం అందిందని ఆరోపించారు. ఖైదీల జాబితాలో అలెక్సీ పేరు లేదని ఆయన చెప్పారు. అతడిని ఎక్కడికి బదిలీ చేశారన్న సమాచారం కూడా అధికార యంత్రాంగం చెప్పడం లేదన్నారు. 2017లో నవానీపై ఘోరమైన దాడి జరిగింది. ఇందులో అతని కళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. 2020లో అలెక్సీపై విష ప్రయోగం జరిగింది.