Russia-Ukraine Drone War: రష్యా-ఉక్రెయిన్ డ్రోన్ యుద్ధం.. 158 డ్రోన్లు కూల్చివేత
రష్యా, ఉక్రెయిన్ మధ్య డ్రోన్ యుద్ధం కొనసాగుతోంది. ఉక్రెయిన్ నుంచి దూసుకొచ్చిన 158 డ్రోన్లను రష్యా కూల్చేసినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. మాస్కో సహా మరో తొమ్మిది ప్రాంతాలను అర్ధరాత్రి లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగినట్లు తెలిసింది. ఈ దాడుల్లో ఎటువంటి ప్రాణ నష్టం సంభవించలేదని వివరించింది. ఉక్రెయిన్ జరిపిన అతిపెద్ద డ్రోన్ దాడుల్లో ఇదొకటని రష్యా అధికారులు ధ్రువీకరించారు. ఉక్రెయిన్ సరిహద్దుల్లో ఉన్న కుర్క్స్, బ్రయాన్స్క్, వొరోనెజ్, బెల్గోరోడ్ ప్రాంతాల్లో 122 డ్రోన్లను కూల్చినట్లు రష్యా అధికారులు వెల్లడించారు.
ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు
బ్రయాన్స్క్ ప్రాంతంలో భారీ యూఏవీ డ్రోన్‌ను రష్యా దళాలు సమర్థవంతంగా కూల్చినట్లు ప్రాంతీయ గవర్నర్ అలెగ్జాండర్ బోగోమాజ్ వివరించారు. ఇక, మూడు డ్రోన్లు కషీరా బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్‌ను లక్ష్యంగా చేసుకుని దాడి చేయడానికి ప్రయత్నించాయని, ఈ దాడుల్లో ఎటువంటి నష్టం జరగలేదని స్థానిక అధికారి తేల్చి చెప్పారు. దాడుల కారణంగా నగర సరిహద్దులోని విద్యుత్ ప్లాంట్ దెబ్బతినింది. బెల్గోరోడ్‌లోని మూడు నివాస భవనాల్లో అద్దాలు పగిలిపోయాయని, ఒక ప్రైవేటు నివాస యుటిలిటీ భవనం పూర్తిగా ధ్వంసమైందని ప్రాంతీయ గవర్నర్ వ్యాచెస్లావ్ గ్లాడ్కోవ్ తెలిపారు.