Russia- Ukraine: ఉక్రెయిన్‌పై ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించిన రష్యా..
రష్యా ఉక్రెయిన్‌పై తొలిసారిగా ఖండాంతర క్షిపణి (ICBM)తో దాడి చేసినట్లు కీవ్ వాయుసేన గురువారం ప్రకటించింది. ఈ దాడి డెనిపర్ నగరంలో జరిగినట్లు పేర్కొంది. కానీ, ఎలాంటి ఖచ్చితమైన క్షిపణిని ఉపయోగించారన్న వివరాలను మాత్రం వెల్లడించలేదు. అలాగే, ఎక్స్-47ఎం2 కింజాల్ బాలిస్టిక్ క్షిపణిని కూడా ప్రయోగించినట్లు వివరించింది. ఈ ఆరోపణలపై రష్యా స్పందించేందుకు నిరాకరించింది. తమకు చెప్పడానికి ఏమీ లేదని, ఇది సైనిక అధికారులను అడగాల్సిన విషయం అని క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ స్పష్టం చేశారు.
దీర్ఘశ్రేణి ఆయుధాలుగా ఖండాంతర క్షిపణులు
ఖండాంతర క్షిపణులను సాధారణంగా దీర్ఘశ్రేణి ఆయుధాలుగా పరిగణిస్తారు. కనీసం 5,500 కిలోమీటర్ల దూరం వరకు లక్ష్యాలను ఛేదించగల సామర్థ్యం ఉన్న ఈ క్షిపణులు, భూగర్భ సిలోలు లేదా మొబైల్ వాహనాల నుంచి ప్రయోగించబడతాయి. 1957లో సోవియట్ యూనియన్ మొదటిసారిగా ఐసీబీఎంను ప్రయోగించగా, అమెరికా 1959లో విజయవంతమైన పరీక్షలు నిర్వహించింది. అంతే కాకుండా, 3,000 నుంచి 5,000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించే క్షిపణులను మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణులుగా పిలుస్తారు.
కీవ్‌లో అమెరికా సహా పలు దౌత్య కార్యాలయాల మూసివేత
అమెరికా ప్రభుత్వం ఉక్రెయిన్‌కు దీర్ఘశ్రేణి క్షిపణులు అందిస్తామని, వాటిని రష్యా భూభాగంపై దాడులకు ఉపయోగించుకునేందుకు అనుమతిస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయంపై రష్యా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అణ్వస్త్ర ప్రయోగానికి సంబంధించి ఒక కీలక దస్త్రంపై సంతకం చేశారు. ఉక్రెయిన్‌కు మద్దతు ఇస్తున్న దేశాలను యుద్ధంలో ప్రత్యర్థులుగా పరిగణిస్తామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో, రష్యా నుంచి పెద్ద దాడి ముప్పు ఉంటుందన్న సమాచారంతో, కీవ్‌లోని అమెరికా సహా పలు దౌత్య కార్యాలయాలను నిన్న మూసివేశారు.