Loading...
Russian cargo: రష్యా సరుకు నౌకలో కొనసాగుతున్న మంటలు.. రంగంలోకి మూడు దేశాల సిబ్బంది

Russian cargo: రష్యా సరుకు నౌకలో కొనసాగుతున్న మంటలు.. రంగంలోకి మూడు దేశాల సిబ్బంది

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 23, 2026
09:07 am

ఈ వార్తాకథనం ఏంటి

బాల్టిక్‌ సముద్రంలోని ఫిన్లాండ్‌ జలసంధిలో డ్రోన్‌ దాడికి గురైన రష్యా సరుకు రవాణా నౌకలో మంటలు ఇంకా అదుపులోకి రాలేదు. మంటలను ఆర్పేందుకు ఫిన్లాండ్‌, ఎస్టోనియా, రష్యాకు చెందిన సిబ్బంది సంయుక్తంగా ప్రయత్నిస్తున్నారు. స్పార్టా-2 పేరుతో ఉన్న ఈ నౌక బాల్టిక్‌ సముద్ర తీరంలోని కలినిన్‌గ్రాడ్‌ నగరానికి వెళ్తుండగా శనివారం ఉదయం డ్రోన్‌ దాడి జరిగింది. ఈ దాడి వెనుక ఉక్రెయిన్‌ ఉండొచ్చని ఫిన్లాండ్‌ అనుమానం వ్యక్తం చేసింది. తమ సుర్సారీ దీవికి సుమారు 50 కిలోమీటర్ల దూరంలో శనివారం ఉదయం 8.50 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం అందిందని ఫిన్లాండ్‌ అధికారులు వెల్లడించారు.

వివరాలు 

మంటల అదుపునకు మూడు దేశాల సిబ్బంది ప్రయత్నాలు

తమ దేశానికి చెందిన స్పార్టా-2 సరుకు రవాణా నౌకపై రెండు డ్రోన్లు దాడి చేసినట్లు గుర్తించామని కలినిన్‌గ్రాడ్‌ గవర్నర్‌ అలెక్సీ తెలిపారు.

దాడి జరిగిన వెంటనే నౌకలో మంటలు చెలరేగాయి. దీంతో ఫిన్లాండ్‌ సరిహద్దు రక్షణ దళాలు వెంటనే సహాయక చర్యలు చేపట్టాయి.

మంటలను అదుపులోకి తీసుకురావడంతో పాటు నౌక సముద్రంలో మునిగిపోకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నాయి.

ఈ ప్రయత్నాల్లో ఎస్టోనియా, రష్యా సిబ్బంది కూడా పాల్గొంటున్నారు.

ఈ ఘటన జరిగిన ప్రాంతం ఇరుకైన సముద్ర మార్గం కావడంతో నౌకల రాకపోకలకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉన్నప్పటికీ, ప్రస్తుతం ఎలాంటి ప్రమాదం లేదని అధికారులు స్పష్టం చేశారు.

వివరాలు 

ప్రజలకు,పర్యావరణానికి ముప్పు లేదన్న ఫిన్లాండ్

ఈ ప్రమాదం వల్ల పర్యావరణానికి లేదా ప్రజలకు ఎలాంటి ముప్పు లేదని ఫిన్లాండ్‌ అధికారులు తెలిపారు.

ముందుజాగ్రత్త చర్యగా కొద్దిసేపు ఆ ప్రాంతంలో విమానాలు, నౌకల రాకపోకలపై ఆంక్షలు విధించినట్లు వెల్లడించారు.

నౌకలో ఉన్న సరుకును బయటకు తరలించాల్సిన అవసరం లేదని రష్యా అధికారులు పేర్కొన్నారు.

మరోవైపు, నౌకలోని సిబ్బంది అందరినీ సురక్షితంగా బయటకు తీసుకొచ్చినట్లు ఫిన్లాండ్‌ తెలిపింది. వారంతా ప్రస్తుతం రష్యాకు తిరిగి వెళ్తున్నారని వెల్లడించింది.

సరుకు రవాణా నౌకపై జరిగిన దాడిపై తమ సరిహద్దు రక్షణ విభాగం పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తుందని ఫిన్లాండ్‌ ప్రభుత్వం ప్రకటించింది.

ADVERTISEMENT

వివరాలు 

నౌక నిర్వహణ సంస్థపై అమెరికా, ఉక్రెయిన్‌ ఆంక్షలు.. గతంలోనూ డ్రోన్‌ దాడి

ఈ విచారణలో సంబంధిత ఇతర దేశాల ప్రభుత్వ అధికారులు కూడా సహకరించనున్నట్లు తెలిపింది.

కాగా, రష్యాకు చెందిన ఓ కంపెనీ నిర్వహిస్తున్న స్పార్టా-2 నౌకపై అమెరికా, ఉక్రెయిన్‌ ప్రభుత్వాలు ఆంక్షలు విధించాయి.

తమ సంస్థ 2011లో రష్యా రక్షణ శాఖ నియంత్రణలో ఏర్పాటైందని, 2015 నుంచి సైనిక నిర్మాణ రంగానికి సంబంధించిన విభాగం పరిధిలో పనిచేస్తోందని ఆ కంపెనీ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది.

ఇదిలా ఉండగా, ఈ నెల ప్రారంభంలోనూ ఫిన్లాండ్‌ జలసంధి గుండా ప్రయాణిస్తున్న మరో రష్యా నౌకపై ఉక్రెయిన్‌ డ్రోన్‌ దాడి చేసినట్లు సమాచారం.

తాజాగా స్పార్టా-2 నౌకపై జరిగిన దాడిపై ఉక్రెయిన్‌ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

ADVERTISEMENT