Russia-Ukraine War: అర్ధరాత్రి ఉక్రెయిన్‌పై రష్యా క్షిపణుల దాడి.. కీవ్‌లో భారీ పేలుళ్లు
ఈ వార్తాకథనం ఏంటి
ఉక్రెయిన్-రష్యా యుద్ధం మరోసారి ఉధృతమైంది. ఇటీవల రష్యాలోని చమురు శుద్ధి కేంద్రాలపై ఉక్రెయిన్ వరుస దాడులు నిర్వహించడంతో అక్కడ ఇంధన కొరత తీవ్రంగా పెరిగింది. ఈ పరిణామాలకు ప్రతిస్పందనగా రష్యా అర్ధరాత్రి ఉక్రెయిన్‌పై భారీ స్థాయిలో వైమానిక దాడులకు దిగింది. కొన్నిగంటలపాటు క్షిపణులు, డ్రోన్లతో దాడులు కొనసాగించింది. రాజధాని కీవ్‌లో వరుస పేలుళ్ల శబ్దాలు వినిపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ దాడుల కారణంగా పలు నివాస భవనాలు ధ్వంసమయ్యాయి.
వివరాలు
ఒకరు మృతి,11 మందికి గాయాలు
ఈ దాడుల్లో రష్యా బాలిస్టిక్ క్షిపణులతో పాటు క్రూజ్ క్షిపణులను కూడా వినియోగించినట్లు ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. నిప్రో నదికి ఇరువైపులా ఉన్న ప్రాంతాల్లో గణనీయమైన నష్టం సంభవించినట్లు వెల్లడించారు. పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారే అవకాశం ఉందని హెచ్చరిస్తూ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దీంతో అనేక మంది భద్రత కోసం మెట్రో స్టేషన్లలో ఆశ్రయం పొందారు. ఈ దాడిని ఉక్రెయిన్ ప్రభుత్వం అత్యంత తీవ్ర శత్రుదాడిగా అభివర్ణించింది. ప్రభుత్వం విడుదల చేసిన వివరాల ప్రకారం, ఇప్పటి వరకు ఒకరు ప్రాణాలు కోల్పోగా, మరో 11 మంది గాయపడ్డారు. సహాయక బృందాలు సహాయ చర్యలు కొనసాగిస్తున్నాయి.
వివరాలు
మాస్కోలో బ్లాక్ రెయిన్
మరోవైపు, గత కొన్ని రోజులుగా ఉక్రెయిన్ రష్యాపై వందల సంఖ్యలో డ్రోన్లతో దాడులు నిర్వహిస్తోంది. డ్రోన్లు, క్షిపణుల విడిభాగాలను తయారు చేసే కార్మాగారాలతో పాటు సైనిక స్థావరాలు,ఇంధన కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిపింది. అనంతరం మాస్కోలో బ్లాక్ రెయిన్ కురిసినట్లు వార్తలు వెలువడ్డాయి. ఈ వరుస దాడుల ప్రభావంతో రష్యాలో ఇంధన కొరత మరింత తీవ్రమైంది. ఈ విషయాన్ని రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా స్వయంగా అంగీకరించారు. ప్రస్తుతం పెట్రోల్ బంకుల వద్ద ప్రజలు పెద్ద ఎత్తున బారులు తీరుతున్నారు. ఇంధన ధరలు పెరగడంతో పాటు ప్రభుత్వం రేషన్ విధానంలో పెట్రోల్ సరఫరా చేస్తోంది. ఈ కొరతను అధిగమించేందుకు భారత్ నుంచి పెట్రోల్ దిగుమతి చేసుకుంటున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.