LOADING...
Putin India Tour: డిసెంబర్‌లో భారత్‌లో పుతిన్‌ పర్యటన
డిసెంబర్‌లో భారత్‌లో పుతిన్‌ పర్యటన

Putin India Tour: డిసెంబర్‌లో భారత్‌లో పుతిన్‌ పర్యటన

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 02, 2025
09:15 am

ఈ వార్తాకథనం ఏంటి

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ఈ ఏడాది డిసెంబర్‌లో భారత్‌కు రానున్నారు. ప్రతి ఏటా జరిగే ద్వైపాక్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనడానికి ఆయన డిసెంబర్‌ 5, 6 తేదీల్లో భారత పర్యటన చేయనున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికా సుంకాలతో ఒత్తిడి పెంచుతున్న తరుణంలో, భారత్‌-రష్యా సంబంధాలు మరింత దృఢంగా మారుతున్న నేపథ్యంలో ఈ పర్యటన ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకుంది. జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్ ఈ ఆగస్టులో మాస్కో పర్యటన చేసినప్పుడు,పుతిన్‌ భారత్‌కు వస్తారని అధికారికంగా తెలిపారు. అదే విధంగా రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్‌ కూడా గత వారం పుతిన్‌ పర్యటన ఉంటుందని ధృవీకరించారు, అయితే అప్పటివరకు తేదీలను వెల్లడించలేదు.

వివరాలు 

బ్రిక్స్‌ సదస్సు సందర్భంగా నరేంద్ర మోదీ, పుతిన్‌ల భేటీ 

ఇప్పుడు సంబంధిత వర్గాలు డిసెంబర్‌ 5, 6 తేదీల్లో పర్యటన ఖరారైనట్లు స్పష్టం చేశాయి. ప్రధాని నరేంద్ర మోదీ, అధ్యక్షుడు పుతిన్‌లు గత సంవత్సరం రెండు సార్లు కలుసుకున్నారు. జులై నెలలో ఇరుదేశాల వార్షిక శిఖరాగ్ర సమావేశం కోసం ప్రధాని మోదీ రష్యాకు వెళ్లారు. అనంతరం అక్టోబర్‌లో కజాన్‌లో జరిగిన బ్రిక్స్‌ సదస్సు సందర్భంగా మరోసారి భేటీ అయ్యారు. తాజాగా చైనాలో నిర్వహించిన షాంఘై సహకార సంస్థ సదస్సులో కూడా మోదీ, పుతిన్‌లు కలుసుకుని పలు కీలక అంశాలపై చర్చించారు.