Iran New Demands: ఆంక్షలు ఎత్తేయాల్సిందే.. అమెరికాకు ఇరాన్ భారీ డిమాండ్లు
ఈ వార్తాకథనం ఏంటి
హర్మూజ్ జలసంధిని తిరిగి తెరవాలంటే అమెరికా తన వైఖరిని మార్చుకోవాలని ఇరాన్ స్పష్టం చేసింది. వ్యూహాత్మకంగా కీలకమైన ఈ జలసంధి ప్రాంతం నుంచి అమెరికా సైన్యాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది. అంతేకాకుండా ఇరాన్‌పై కొనసాగుతున్న యుద్ధాన్ని శాశ్వతంగా ముగించాలని, దాడుల కారణంగా తమ దేశానికి జరిగిన నష్టానికి పూర్తిస్థాయిలో పరిహారం చెల్లించాలని కోరింది. తమ ఆస్తులపై విధించిన ఆంక్షలను ఎత్తివేయడంతో పాటు.. విదేశాల్లో స్తంభింపజేసిన ఇరాన్ నిధులను ఎలాంటి షరతులు లేకుండా వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేసింది. అలాగే ఇరాన్ నౌకాశ్రయాలపై విధించిన దిగ్బంధనాన్ని కూడా ఎత్తివేయాలని పేర్కొంది. ఈ విషయాలను ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ, సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరీ మహ్మద్ బాగెర్ జోల్ఘాదర్ వెల్లడించారు.
వివరాలు
జూన్ ఒప్పందం తర్వాత మారిన వైఖరి
జూన్‌లో కుదిరిన తాత్కాలిక ఒప్పందంలో హర్మూజ్ జలసంధికి సంబంధించిన కొన్ని అంశాలపై ఇరాన్, అమెరికా మధ్య అంగీకారం కుదిరింది.
ఆంక్షల సడలింపు, విదేశాల్లో స్తంభించిన ఇరాన్ ఆస్తుల విడుదల వంటి అంశాలను తుది ఒప్పందంలో చేర్చాలని అప్పట్లో నిర్ణయించారు.
అయితే ప్రస్తుతం ఇరాన్ తన వైఖరిని మార్చుకుంది. హర్మూజ్ జలసంధిని తెరవాలంటే ముందుగా ఆంక్షలను ఎత్తివేయడంతో పాటు.. విదేశాల్లో స్తంభింపజేసిన నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తోంది.
మరోవైపు అమెరికా మాత్రం ముందుగా హర్మూజ్ జలసంధిపై ఒక ఒప్పందం కుదరాలని భావిస్తోంది.
ఆ తర్వాతే జలసంధిపై కొనసాగుతున్న దిగ్బంధనాన్ని ముగించే అంశాన్ని పరిశీలించాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో ఇరాన్ తాజా డిమాండ్లపై అమెరికా ఇప్పటివరకు ఎలాంటి స్పందన ఇవ్వలేదు.
వివరాలు
అమెరికా అంగీకరించే వరకు జలసంధి తెరవం
ఒమన్‌తో ఇరాన్ కొనసాగిస్తున్న చర్చలు కేవలం నౌకల రాకపోకలకు సంబంధించిన సాంకేతిక మార్గాల కోసమేనని ఇరాన్ స్పష్టం చేసింది.
అమెరికా తమ షరతులను అంగీకరించే వరకు హర్మూజ్ జలసంధిని తెరిచే ప్రసక్తే లేదని తేల్చిచెప్పింది.