Hormouz: హర్మూజ్‌లో నిలిచిన నౌకలే లక్ష్యంగా.. డబ్బులు దోచేస్తున్న మోసగాళ్లు
ఈ వార్తాకథనం ఏంటి
హర్మూజ్ జలసంధి ప్రాంతంలో ఇరాన్‌కు చెందిన నౌకల రాకపోకలపై అమెరికా కట్టుదిట్టమైన దిగ్బంధనాన్ని కొనసాగిస్తోంది. ఈ చర్యల ప్రభావంతో అక్కడ వందల సంఖ్యలో నౌకలు నిలిచిపోయిన పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకుని కొందరు దోపిడీదారులు కొత్త మోసాలకు పాల్పడుతున్నారు. అధికారులమని చెప్పుకుంటూ నౌకల వద్దకు చేరుకుని డబ్బులు వసూలు చేస్తున్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి. ముఖ్యంగా డిజిటల్ నాణేల రూపంలో చెల్లింపులు చేస్తే నౌకలను సురక్షితంగా హర్మూజ్ జలసంధి దాటిస్తామని నమ్మబలుకుతున్నారు.
వివరాలు
నౌకల యజమానులకు హెచ్చరికలు జారీ చేసిన మారిస్క్స్
ఇలాంటి మోసాలపై గ్రీక్‌కు చెందిన సముద్ర ప్రమాద నిర్వహణ సంస్థ మారిస్క్స్ నౌకల యజమానులకు హెచ్చరికలు జారీ చేసింది. ''ఇరాన్ అధికారులమని చెప్పుకుంటూ క్రిప్టో కరెన్సీ, బిట్‌కాయిన్, టెథర్ రూపంలో డబ్బులు ఇవ్వాలని కోరితే ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దు. మీ నౌకలను క్షేమంగా జలసంధి దాటిస్తామని చెప్పే వారిని నమ్మొదు. ఇరాన్ అధికారులు ఇలాంటి అవకాశాలు కల్పించలేదు. ఇది కచ్చితంగా మోసమే'' అని స్పష్టం చేసింది. పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులు ప్రారంభమయ్యే ముందు ప్రపంచవ్యాప్తంగా సముద్ర మార్గంలో జరిగే చమురు రవాణాలో సుమారు 20 శాతం, ద్రవీభవించిన సహజ వాయువు రవాణాలో మరో 20 శాతం హర్మూజ్ జలసంధి ద్వారానే సాగేది. దీంతో ఈ మార్గం అంతర్జాతీయ వాణిజ్యంలో అత్యంత కీలకంగా భావించబడుతోంది.