Ireland: ఐర్లాండ్ బెల్‌ఫాస్ట్‌లో చెలరేగిన హింస.. కార్లు,ఇళ్లకు నిప్పు
ఈ వార్తాకథనం ఏంటి
ఉత్తర ఐర్లాండ్ రాజధాని బెల్‌ఫాస్ట్‌లో భారీ అల్లర్లు చోటుచేసుకున్నాయి. ముసుగులు ధరించిన ఆందోళనకారులు వీధుల్లోకి దిగి బీభత్సం సృష్టించారు. వలసదారులను లక్ష్యంగా చేసుకుని పలు కార్లు,ఇళ్లపై దాడులు చేసి నిప్పంటించారు. దీంతో అనేక వాహనాలు పూర్తిగా దగ్ధమవగా,పలు ప్రాంతాల్లో మంటలు ఎగిసిపడ్డాయి. పెద్ద సంఖ్యలో నిరసనకారులు రోడ్లపైకి రావడంతో నగరంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ అల్లర్లకు ఇటీవల జరిగిన కత్తిపోటు ఘటన కారణంగా తెలుస్తోంది. సూడాన్‌కు చెందిన ఓ వ్యక్తి కత్తితో దాడి చేయగా,బాధితుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ కావడంతో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. ఈ కేసులో సూడాన్‌కు చెందిన 30 ఏళ్ల హాది అలోడిడ్‌ను పోలీసులు అరెస్టు చేశారు.
వివరాలు
వైరల్ వీడియోతో పెరిగిన ఉద్రిక్తతలు
హత్యాయత్నం అభియోగాలపై అతడిని కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం రిమాండ్‌కు పంపింది. దాడిలో బాధితుడు ఒక కన్ను కోల్పోయాడని,ముఖం,వెన్నుపై తీవ్ర గాయాలయ్యాయని కోర్టుకు అధికారులు తెలిపారు. కత్తిపోటు ఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బెల్‌ఫాస్ట్‌లో ఉద్రిక్తతలు ఒక్కసారిగా పెరిగాయి. హింసాత్మక నిరసనలకు సోషల్ మీడియా వేదికగా పిలుపులు రావడంతో పెద్ద ఎత్తున గుంపులు వీధుల్లోకి వచ్చాయి. పలుచోట్ల పోలీసులపై రాళ్లు రువ్వడంతో పాటు కార్లు,బస్సులకు నిప్పంటించారు. కొన్ని కుటుంబాలు తమ ఇళ్లలో చిక్కుకుపోగా,పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అల్లర్లలో అనేక వాహనాలు పూర్తిగా కాలిపోయాయి. స్థానిక రాజకీయ నాయకులు, మతపెద్దల సమాచారం ప్రకారం దాడులకు గురైన వారిలో ఎక్కువ మంది నల్లజాతీయులు, వలసదారులే ఉన్నట్లు తెలుస్తోంది.
వివరాలు
కీర్ స్టార్మర్ ఖండన
బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ బెల్‌ఫాస్ట్ హింసను తీవ్రంగా ఖండించారు. జాతి, వంశం లేదా నేపథ్యం ఆధారంగా ప్రజలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేశారు. అల్లర్లకు పాల్పడిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇటీవల బ్రిటన్‌లో వలసదారుల అంశంపై రాజకీయ, సామాజిక చర్చలు మరింత ముదిరాయి. ఆశ్రయం విధానాల కారణంగా ప్రమాదకర వ్యక్తులు దేశంలోకి ప్రవేశిస్తున్నారని కొన్ని జాతీయవాద, ప్రజాహిత వర్గాలు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాయి. మరోవైపు, ఇటీవల చోటుచేసుకున్న హత్యా ఘటనలు, జాతి వివక్ష ఆరోపణలు దేశవ్యాప్తంగా ఉద్రిక్తతలకు దారితీశాయి. ఈ నేపథ్యంలో బెల్‌ఫాస్ట్‌లో జరిగిన తాజా హింసాకాండ బ్రిటన్‌లో వలసదారుల భద్రత, సామాజిక సామరస్యంపై మరోసారి ఆందోళనలను పెంచుతోంది.