White House: వైట్ హౌస్ సమీపంలో మళ్లీ కాల్పుల కలకలం .. మరోసారి బయటపడ్డ భద్రతా లోపం
ఈ వార్తాకథనం ఏంటి
వైట్ హౌస్ సమీపంలో మరోసారి భద్రతా లోపం వెలుగులోకి వచ్చింది. వాషింగ్టన్ మాన్యూమెంట్ సమీపంలో తుపాకీతో అనుమానాస్పద వ్యక్తి హల్‌చల్ చేశాడు. గస్తీ కాస్తున్న సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లను చూసిన వెంటనే అతను కాల్పులు ప్రారంభించాడు. ఎదురు కాల్పుల్లో అనుమానితుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనలో ఓ బాలుడు కూడా గాయపడటం ఆందోళన కలిగించింది. కాల్పులు జరగడానికి కొద్దిసేపటి ముందే, వైట్ హౌస్ పరిసరాల్లో విధుల్లో ఉన్న రహస్య భద్రతా విభాగ సిబ్బంది తుపాకీతో ఉన్నట్టు కనిపించిన అనుమానితుడిని గుర్తించారు. యూనిఫాంలో ఉన్న పోలీసులు అతడిని అడ్డుకునేందుకు ముందుకు రాగానే, అతను అక్కడి నుంచి పరుగెత్తుతూ అధికారులపై కాల్పులు జరిపాడు. వెంటనే అధికారులు ప్రతిగా కాల్పులు జరపడంతో అతనికి బుల్లెట్ గాయాలు అయ్యాయి.
వివరాలు
నిందితుడు మేరీల్యాండ్‌కు చెందిన శ్వేతజాతీయుడు
ఈ వ్యక్తి ముందుగా వైట్ హౌస్ ప్రవేశ ద్వారం వద్దకు చేరేందుకు ప్రయత్నించాడా అనే కోణంలో అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రాథమిక వివరాల ప్రకారం అతను మేరీల్యాండ్‌కు చెందిన శ్వేతజాతీయుడిగా గుర్తిస్తున్నారు. ప్రస్తుతం అతనికి సమీప ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. నిందితుడు జరిపిన కాల్పుల్లో గాయపడిన బాలుడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. అతనికి ప్రాణాపాయం లేదని, స్వల్ప గాయాలతో బయటపడ్డాడని స్థానిక పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో భద్రతా సిబ్బందిలో ఎవరూ గాయపడలేదు.
వివరాలు
వైట్ హౌస్‌లోని ఈస్ట్ రూమ్‌లో డొనాల్డ్ ట్రంప్
కాల్పులు జరగడానికి కొద్దిసేపటి ముందు ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కాన్వాయ్ అదే మార్గంలో వెళ్లడం గమనార్హం. ఈ ఘటన అనంతరం కొద్దిసేపటికే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్‌లోని ఈస్ట్ రూమ్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రసంగించారు. ఆయనకు ఎలాంటి ముప్పు లేదని, ఈ ఘటనకు వైట్ హౌస్‌తో ప్రత్యక్ష సంబంధం ఉన్నట్లు ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు లేవని అధికారులు స్పష్టం చేశారు. రెండు వారాల వ్యవధిలో ఇదే ప్రాంతంలో మరోసారి ఇలాంటి కాల్పుల ఘటన చోటుచేసుకోవడం ఆందోళనకు గురిచేస్తోంది.