New York: న్యూయార్క్‌లో భారత స్వాతంత్య్ర దినోత్సవానికి ప్రత్యేక గుర్తింపు.. సెనెట్ కీలక తీర్మానం
ఈ వార్తాకథనం ఏంటి
రాబోయే ఆగస్టు 15ను భారత స్వాతంత్య్ర దినోత్సవంగా అధికారికంగా గుర్తించాలని కోరుతూ న్యూయార్క్ సెనెట్ ఒక కీలక తీర్మానాన్ని ఆమోదించింది. ఈ తీర్మానాన్ని గవర్నర్ కేథీ హోచల్ పరిశీలించి తగిన నిర్ణయం తీసుకోవాలని సభ్యులు విజ్ఞప్తి చేశారు. తీర్మానంపై జరిగిన చర్చలో సెనెట్ సభ్యులు మహాత్మా గాంధీ అందించిన విలువలను, ఆయన గొప్ప వారసత్వాన్ని స్మరించుకున్నారు. అలాగే అమెరికా అభివృద్ధిలో ఇండో-అమెరికన్ సమాజం పోషిస్తున్న పాత్రను ప్రశంసించారు. వివిధ రంగాల్లో భారతీయ మూలాలున్న అమెరికన్లు అందిస్తున్న సేవలు దేశ పురోగతికి దోహదపడుతున్నాయని పేర్కొన్నారు.
వివరాలు
భారతీయ సమాజానికి గౌరవం
ఈ సందర్భంగా సెనేటర్ జెరెమి కూనీ మాట్లాడుతూ, న్యూయార్క్ ప్రజల సాంస్కృతిక వారసత్వానికి ప్రాధాన్యమైన అధికారిక దినోత్సవాలను గుర్తించడం రాష్ట్ర శాసనసభ బాధ్యత అని అన్నారు. అందుకే ఈ తీర్మానానికి మద్దతు తెలుపుతున్నట్లు చెప్పారు. తీర్మానానికి అనుకూలంగా పలువురు సెనేటర్లు కూడా తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. భారత స్వాతంత్య్ర దినోత్సవానికి ప్రత్యేక గుర్తింపు ఇవ్వడం ద్వారా రాష్ట్రంలోని భారతీయ సమాజానికి గౌరవం చాటినట్లవుతుందని వారు అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉండగా, న్యూయార్క్‌లోని భారత కాన్సులేట్ జనరల్ సెనెట్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని స్వాగతించింది. భారత్, అమెరికా దేశాల మధ్య కొనసాగుతున్న స్నేహపూర్వక సంబంధాలకు ఈ తీర్మానం ప్రతిబింబంగా నిలుస్తుందని పేర్కొంటూ సెనెట్ చర్యను అభినందించింది.