China Nuclear Data Leak: అణ్వాయుధాల రహస్యాల లీక్? చైనా టాప్ జనరల్ పై ఆరోపణలు
ఈ వార్తాకథనం ఏంటి
చైనాలో అత్యున్నత స్థాయి సైనికాధికారుల్లో ఒకరైన వ్యక్తి ఇప్పుడు తీవ్రమైన వివాదంలో చిక్కుకున్నారు. అవినీతి ఆరోపణలతో పాటు, అత్యంత గోప్యమైన అణ్వాయుధాలకు సంబంధించిన సమాచారాన్ని అగ్రరాజ్యానికి లీక్ చేశారన్న ఆరోపణలు రావడంతో ఆయనపై విచారణ ప్రారంభమైనట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఈ పరిణామం చైనా మిలిటరీ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌కు అత్యంత సన్నిహితుడిగా భావించబడుతున్న జనరల్ జాంగ్ యూక్సియా ప్రస్తుతం ఆ దేశ సెంట్రల్ మిలిటరీ కమిషన్ వైస్ ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీలో అత్యున్నత స్థాయిలో ఉన్న అధికారిగా ఆయనకు పేరు ఉంది. ఈ నేపథ్యంలో,అమెరికాకు చెందిన ప్రముఖ పత్రిక వాల్‌స్ట్రీట్ జర్నల్ ఇటీవల జాంగ్‌పై సంచలన కథనాన్ని ప్రచురించింది.
వివరాలు
చైనా అణ్వాయుధ ప్రోగ్రామ్‌కు సంబంధించిన కీలక సాంకేతిక వివరాలు అమెరికాకు
ఆ కథనం ప్రకారం, చైనా అణ్వాయుధ ప్రోగ్రామ్‌కు సంబంధించిన కీలక సాంకేతిక వివరాలను జాంగ్ యూక్సియా అమెరికాకు అందజేశారన్న ఆరోపణలు ఉన్నాయి. చైనీస్ మిలిటరీలోని ఉన్నతస్థాయి వర్గాలను ఆధారంగా చేసుకుని ఈ వివరాలను వెల్లడించినట్లు వాల్‌స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. ఇదే కాకుండా, పదోన్నతుల విషయంలో భారీగా లంచాలు తీసుకోవడం, కిందిస్థాయి సిబ్బందిపై వేధింపులకు పాల్పడటం, ఆయుధాలు,సైనిక పరికరాల కొనుగోళ్లలో అవినీతి వ్యవహారాలకు సంబంధించి కూడా జాంగ్‌పై ఆరోపణలు వచ్చినట్లు ఆ కథనం తెలిపింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఆయనపై ఉన్నతస్థాయి విచారణకు చైనా రక్షణ మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.
వివరాలు
జిన్‌పింగ్‌కు వ్యతిరేకంగా సైనిక తిరుగుబాటు
అవినీతి నిర్మూలనే లక్ష్యంగా చైనా కమ్యూనిస్టు పార్టీ చేపట్టిన కఠిన చర్యల్లో భాగంగానే ఈ విచారణ కొనసాగుతోందని వాషింగ్టన్‌లోని చైనా ఎంబసీ అధికార ప్రతినిధి వ్యాఖ్యానించినట్లు ఆ కథనంలో పేర్కొన్నారు. అయితే,ఈ వ్యవహారంపై ఇప్పటివరకు చైనా ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు. ఇదిలా ఉండగా,ఈ కథనం వెలువడిన తర్వాత సోషల్ మీడియా వేదికగా జాంగ్ యూక్సియాపై మరిన్ని ఆరోపణలు చక్కర్లు కొడుతున్నాయి. అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌కు వ్యతిరేకంగా సైనిక తిరుగుబాటు ప్రయత్నం జరిగిందన్న ప్రచారం కూడా ఊపందుకుంది. ఈ నేపథ్యంలో జాంగ్‌తో పాటు మరికొంతమంది సీనియర్ జనరల్స్‌ను అదుపులోకి తీసుకున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. అయితే,ఈ సమాచారంను చైనా అధికారులు గానీ, పశ్చిమ దేశాల నిఘా సంస్థలు గానీ ఇప్పటివరకు ధ్రువీకరించలేదు.