Loading...
Pakistan: ఐఎంఎఫ్ అప్పులతో గట్టెక్కిన పాక్‌కు కొత్త బాధ్యత.. బారోయర్స్ ప్లాట్‌ఫామ్ చైర్మన్‌గా నియామకం
బారోయర్స్ ప్లాట్‌ఫామ్ చైర్మన్‌గా నియామకం

Pakistan: ఐఎంఎఫ్ అప్పులతో గట్టెక్కిన పాక్‌కు కొత్త బాధ్యత.. బారోయర్స్ ప్లాట్‌ఫామ్ చైర్మన్‌గా నియామకం

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 19, 2026
01:49 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆర్థిక సంక్షోభంతో రెండేళ్ల క్రితం దివాళా అంచులకు చేరిన పాకిస్థాన్ ఇప్పుడు రుణాలు తీసుకునే దేశాలకు నాయకత్వం వహించనుంది. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్), సౌదీ అరేబియా, చైనా వంటి దేశాలు అందించిన ఆర్థిక సాయంతో అప్పట్లో తీవ్ర సంక్షోభం నుంచి బయటపడింది. అయితే, ప్రస్తుతం కూడా ఆ దేశ ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా లేదు. ఆర్థిక అవసరాల కోసం విదేశీ రుణాలపై ఆధారపడుతున్న పాకిస్థాన్‌కు తాజాగా కీలక బాధ్యత దక్కింది.

వివరాలు 

ఈ కొత్త వేదికకు చైర్మన్‌గా పాకిస్థాన్ ఆర్థిక మంత్రి

ఐక్యరాజ్య సమితి మద్దతుతో ఏర్పాటైన 'బారోయర్స్ ప్లాట్‌ఫామ్' గవర్నింగ్ కౌన్సిల్‌కు 2026 సంవత్సరానికి పాకిస్థాన్ అధ్యక్షత వహిస్తోంది.

ఈ కొత్త వేదికకు చైర్మన్‌గా పాకిస్థాన్ ఆర్థిక మంత్రి ముహమ్మద్ ఔరంగజేబ్ బాధ్యతలు చేపట్టారు.

తరచూ విదేశీ రుణాలు తీసుకునే పాకిస్థాన్ ఇప్పుడు రుణగ్రహీత దేశాల వేదికకు నాయకత్వం వహించడం ఆసక్తికరంగా మారింది.

రుణాల నిర్వహణలో దేశాల మధ్య సహకారాన్ని పెంచడం, ఆర్థిక సంస్కరణలకు సంబంధించిన అనుభవాలను పరస్పరం పంచుకోవడం ఈ వేదిక ప్రధాన లక్ష్యాలు.

అలాగే ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూపొందించిన కార్యాచరణ ప్రణాళికను అమలు చేయడంలోనూ పాకిస్థాన్ కీలక పాత్ర పోషించనుంది.

వివరాలు 

రుణాలు ఇచ్చే సంస్థలు, దేశాలకు ఇప్పటికే వివిధ వేదికలు

సులభంగా చెప్పాలంటే.. అప్పులు తీసుకునే అభివృద్ధి చెందుతున్న దేశాలన్నింటినీ ఒకే వేదికపైకి తీసుకురావడమే బారోయర్స్ ప్లాట్‌ఫామ్ ఉద్దేశం.

ఈ వేదిక ద్వారా దేశాలు తమ రుణాల నిర్వహణకు సంబంధించిన సమాచారాన్ని పరస్పరం ఇచ్చిపుచ్చుకోవచ్చు.

అప్పులను సమర్థంగా నిర్వహించేందుకు అవసరమైన సామర్థ్యాలను పెంపొందించుకోవడంతోపాటు ఎదురయ్యే సమస్యలు, సవాళ్లపై చర్చించుకోవచ్చు.

రుణాలు ఇచ్చే సంస్థలు, దేశాలకు ఇప్పటికే వివిధ వేదికలు అందుబాటులో ఉన్నాయి.

అదే తరహాలో రుణాలు తీసుకునే దేశాలు తమ సమస్యలను చర్చించుకునేందుకు, అనుభవాలను పంచుకునేందుకు ఈ ప్లాట్‌ఫామ్ ఉపయోగపడుతుంది.

ADVERTISEMENT

వివరాలు 

ఇప్పటికీ అంతర్జాతీయ ఆర్థిక సాయం కోసం ఎదురుచూస్తున్న పాక్ 

మరోవైపు, పాకిస్థాన్ ఇప్పటికీ అంతర్జాతీయ ఆర్థిక సాయం కోసం ఎదురుచూస్తూనే ఉంది.

అక్టోబర్ 7న కూడా 1.21 బిలియన్ డాలర్ల రుణం కోసం ఐఎంఎఫ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది.

అయితే, ఈ రుణానికి సంస్థ ఎగ్జిక్యూటివ్ బోర్డు ఆమోదం లభించాల్సి ఉంది.

2023లో తీవ్ర ఆర్థిక సంక్షోభంతో దివాళా ముప్పును ఎదుర్కొన్న పాకిస్థాన్‌కు ఐఎంఎఫ్ అందించిన 3 బిలియన్ డాలర్ల బెయిలవుట్ ప్యాకేజీ ఊరటనిచ్చింది.

దీంతో అప్పట్లో సంక్షోభం నుంచి బయటపడగలిగింది. ఆ తర్వాత 2024లో ఐఎంఎఫ్ నుంచి మరో 7 బిలియన్ డాలర్ల ఆర్థిక ప్యాకేజీని పాకిస్థాన్ పొందింది.

వాతావరణ మార్పుల ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు కూడా ఐఎంఎఫ్ నుంచి అదనంగా 1.3 బిలియన్ డాలర్ల రుణాన్ని తీసుకుంది.

ADVERTISEMENT

వివరాలు 

ఈ వేదికలో చేరడానికి సభ్యత్వ రుసుము లేదు 

అయినప్పటికీ విదేశీ రుణాలపై ఆ దేశం ఆధారపడటం కొనసాగుతోంది.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్థాన్ వెల్లడించిన సమాచారం ప్రకారం.. 2026 మార్చి నాటికి ఆ దేశం తీసుకున్న విదేశీ రుణాల మొత్తం 137.55బిలియన్ డాలర్లకు చేరింది.

బారోయర్స్ ప్లాట్‌ఫామ్ ఆవిర్భావానికి సంబంధించిన ఆలోచన 2025 జులైలో స్పెయిన్‌లోని సెవిల్లెలో జరిగిన గ్లోబల్ డెవలప్‌మెంట్ ఫైనాన్సింగ్ కాన్ఫరెన్స్‌లో తెరపైకి వచ్చింది.

అనంతరం 2026 ఏప్రిల్ 15న అమెరికా రాజధాని వాషింగ్టన్‌లో ఈ వేదిక అధికారికంగా ఏర్పాటైంది.

వివిధ దేశాల ప్రభుత్వాలు తమ రుణ అనుభవాల నుంచి ఇతర దేశాలు నేర్చుకునేందుకు,నిపుణుల సలహాలు పొందేందుకు,అప్పుల నిర్వహణకు సంబంధించిన సమాచారాన్ని పంచుకునేందుకు ఇది సహాయపడుతుంది.

ఈ వేదికలో సభ్యత్వం పొందడానికి ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.

వివరాలు 

ప్రతి సంవత్సరం కొత్త చైర్మన్

బారోయర్స్ ప్లాట్‌ఫామ్ సభ్య దేశాలు ప్రతి సంవత్సరం కొత్త చైర్మన్‌ను ఎన్నుకుంటాయి.

వివిధ దేశాల ఆర్థిక మంత్రులు,రిజర్వ్ బ్యాంకుల గవర్నర్లు,ఇతర ఉన్నతాధికారులతో కూడిన గవర్నింగ్ కౌన్సిల్ ఈ వేదిక ప్రాధాన్యతలను నిర్ణయిస్తుంది.

అప్పుల భారాన్ని ఎదుర్కొంటున్న దేశాలు తమ అనుభవాలను పంచుకోవడం, పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవడం, రుణ నిర్వహణలో ఎదురయ్యే సవాళ్లకు పరిష్కారాలను అన్వేషించడం వంటి బాధ్యతలు చైర్మన్‌పై ఉంటాయి.

ఇప్పుడు ఇదే బాధ్యతను పాకిస్థాన్ చేపట్టడం గమనార్హం.

ఒకవైపు భారీ విదేశీ రుణాలు, మరోవైపు అంతర్జాతీయ ఆర్థిక సాయంపై ఆధారపడుతున్న ఆ దేశం.. రుణగ్రహీత దేశాల వేదికకు నాయకత్వం వహించనుంది.

అప్పుల నిర్వహణలో తన అనుభవాలను ఇతర దేశాలతో పంచుకోవడంతోపాటు, వాటి సమస్యలను పరిష్కరించుకునేందుకు సహకరించడం పాకిస్థాన్ ముందున్న ప్రధాన బాధ్యత.

ADVERTISEMENT